Loading...
Harvard University: దానం చేసిన మృతదేహాల భాగాలు బ్లాక్‌ మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్‌పై తీవ్ర ఆరోపణలు
హార్వర్డ్‌పై తీవ్ర ఆరోపణలు

Harvard University: దానం చేసిన మృతదేహాల భాగాలు బ్లాక్‌ మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్‌పై తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపరచకపోవడమే కాకుండా.. వాటి నుంచి శరీర భాగాలను బ్లాక్‌ మార్కెట్లో విక్రయించిన ఘటనపై హార్వర్డ్‌ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలికేందుకు హార్వర్డ్‌ రూ.507 కోట్లతో సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. వైద్య పరిశోధనల నిమిత్తం హార్వర్డ్‌ మెడికల్ స్కూల్‌కు పలువురు తమ మృతదేహాలను దానం చేస్తుంటారు. వీటిని భద్రపరిచే శవాగారాన్ని సెడ్రిక్ లాడ్జ్‌ అనే వ్యక్తి నిర్వహించేవాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు అతడు అక్కడ పనిచేశాడు. అయితే 2018 నుంచి దానంగా వచ్చిన మృతదేహాల నుంచి వివిధ శరీర భాగాలను అక్రమంగా తీసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

వివరాలు 

సెడ్రిక్ లాడ్జ్‌ అరెస్ట్ 

మృతదేహాల నుంచి తలలు, చర్మం, చేతులు, ఇతర భాగాలను తొలగించి.. వాటిని తన ఇంటికి తీసుకెళ్లేవాడని అధికారులు గుర్తించారు.

ఈ అక్రమ వ్యవహారంలో అతడి భార్య కూడా సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆ శరీర భాగాలను బ్లాక్‌ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది.

ఈ కేసులో సెడ్రిక్ లాడ్జ్‌ను 2023లో అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్‌లో కోర్టు అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో తమ ఆత్మీయులు దానంగా ఇచ్చిన మృతదేహాలను హార్వర్డ్‌ సిబ్బంది సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ పలువురు కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దీంతో ఈ వివాదానికి పరిష్కారం చూపేందుకు హార్వర్డ్‌ సెటిల్‌మెంట్‌కు ముందుకొచ్చింది.

వివరాలు 

ఈ సెటిల్‌మెంట్ ప్రక్రియకు బోస్టన్‌లోని న్యాయస్థానం ఆమోదం తెలిపింది

బోస్టన్‌లోని న్యాయస్థానం ఈ సెటిల్‌మెంట్ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

దావాలను పరిష్కరించేందుకు బాధిత కుటుంబాలకు మొత్తం రూ.507 కోట్లు చెల్లించేందుకు హార్వర్డ్‌ అంగీకరించింది.

అంతేకాకుండా జరిగిన ఘటనపై బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా, పర్యవేక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

దానంగా మృతదేహాలను అందించిన వారి జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించింది.

ADVERTISEMENT