US Hate Crime: ఇజ్రాయెల్ బందీల పోస్టర్ల వివాదం.. యూదు మహిళపై ఇద్దరు అమెరికన్ల దాడి
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల పోస్టర్లను చింపివేయడాన్ని అడ్డుకున్న 41ఏళ్ల యూదు మహిళపై మరో ఇద్దరు యువతులు దాడి చేశారు. ఈ ఘటన అమెరికా న్యూయార్క్ నగరంలోని యూనియన్ స్క్వేర్ సబ్‌వే స్టేషన్ సమీపంలో జరిగింది. మెహ్విష్ ఒమర్, స్టెఫానీ గొంజాలెజ్ అనే యువతులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వెస్ట్ సైడ్‌లోని వీధి లైట్ వద్ద ఇజ్రాయెల్ బందీల పోస్టర్‌లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యూదు మహిళ ఆ ఇద్దరి వద్దకు వచ్చి వారిని అలా చేయొద్దని వారించింది. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది.
ఇద్దరు యువతుల అరెస్టు.. కేసులు నమోదు
ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఒమెర్, గొంజాలెజ్ ఆ మహిళపై దారుణంగా దాడి చేసారు. అంతేకాదు మెడపై ఉన్న నెక్లెస్‌ను తెంపేసి.. ఫోన్‌ను నేలపై పడేసి దారుణంగా వ్యవహరించారు. బాధితురాలికి ముఖం, మెడపై స్వల్పగాయాలు కావడంతో ఇద్దరు యువతులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం బాధిత యూదు మహిళ పోలీసులను ఆశ్రయించారు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడిపై దర్యాప్తు చేసింది. ఒమెర్, గొంజాలెజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒమెర్‌పై నేరపూరిత అల్లర్లు, ద్వేషపూరిత నేరాలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. గొంజాలెజ్‌పై ద్వేషపూరిత నేరాలు, దోపిడీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.