Loading...
flydubai: ప్రేయర్‌ చేస్తానని చెప్పి వెనుక నుంచి నరికాడు : స్మిత్‌ మచ్చర్
ప్రేయర్‌ చేస్తానని చెప్పి వెనుక నుంచి నరికాడు : స్మిత్‌ మచ్చర్

flydubai: ప్రేయర్‌ చేస్తానని చెప్పి వెనుక నుంచి నరికాడు : స్మిత్‌ మచ్చర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై కో-పైలట్‌ దాడి చేసిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ (Smit Machchhar) కీలక విషయాలను వెల్లడించారు. విమానం నడుపుతున్న సమయంలో కో-పైలట్‌ తాను ప్రార్థన చేసుకుంటానని చెప్పి తన వెనక్కి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన పైలట్లు ఇలా ప్రార్థనలు చేసుకోవడం సర్వసాధారణమే కావడంతో తాను కో-పైలట్‌ను అడ్డుకోలేదని స్మిత్‌ మచ్చర్‌ వివరించారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే కాక్‌పిట్‌లో ఉండే గొడ్డలితో తనపై వెనుక నుంచి దాడి జరిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాడి జరిగిన వెంటనే తాను అప్రమత్తమై కాక్‌పిట్‌ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినట్లు స్మిత్‌ మచ్చర్‌ తెలిపారు.

వివరాలు

ప్రయాణికుల సాయంతో పరిస్థితిని అదుపులోకి వచ్చింది

అయితే కో-పైలట్‌ తనను అడ్డుకుని తలుపులను తిరిగి మూసివేశాడని చెప్పారు.

ఎలాగైనా విమానంలోని ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో బలం కూడదీసుకుని మరోసారి కాక్‌పిట్‌ తలుపులు తెరిచినట్లు వెల్లడించారు.

ఆ సమయంలో తాను సాయం కోసం కోరడంతో కొంతమంది ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వచ్చారని.. అనంతరం వారు కో-పైలట్‌ను బంధించినట్లు స్మిత్‌ మచ్చర్‌ తెలిపారు.

దీంతో ప్రయాణికుల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగినట్లు వివరించారు.

వివరాలు

విద్యార్థిగా రెండేళ్లు ఆస్ట్రేలియాలో..

ఈ దాడికి నిందితుడిగా భావిస్తున్న ఒమన్‌కు చెందిన హమామ్‌ అల్‌-హమ్మామీ (29)కు ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు.

ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు అతడు ఒమన్‌, సిరియా, మొరాకో దేశాల్లోనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ రెండేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

2015లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన హమామ్‌ అల్‌-హమ్మామీ.. 2017 వరకు అక్కడే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆ సమయంలో అతడు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే అంశంపై ఆస్ట్రేలియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌ (ASIO) సహా పలు ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి.

ADVERTISEMENT

వివరాలు

హమామ్‌కు అల్‌ఖైదా మద్దతు

మరోవైపు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీకి మద్దతుగా పలు పోస్టులు చేస్తోంది. 9/11 దాడులను ప్రస్తావిస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన విమానాల్లోనూ ఇటువంటి దాడులు చేపట్టాలని పిలుపునిచ్చింది.

ఈ మేరకు అల్‌ఖైదా తన వారపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా ట్విన్‌ టవర్స్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో పాటు ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా ఆ కథనంలో ప్రచురించడం గమనార్హం.

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించి దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.

హమామ్‌ అల్‌-హమ్మామీ నేపథ్యం, అతడు వివిధ దేశాల్లో ఉన్న సమయంలో నిర్వహించిన కార్యకలాపాలు, ఉగ్రవాద భావజాలంతో అతడికి ఉన్న సంబంధాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT