Brazil: బ్రెజిల్‌లో గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ఆదివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్, కమెడియన్ ఒలివర్ ట్రీతో పాటు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో డి జనీరో పశ్చిమ ప్రాంతమైన రెక్రియో డోస్ బాందీరాంటెస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం యూరోకాప్టర్ AS350, బెల్ 206 మోడళ్లకు చెందిన రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొని ముక్కలయ్యాయి. ప్రమాదం అనంతరం హెలికాప్టర్ల శకలాలు సమీపంలోని చైనాకు చెందిన బీవైడీ (BYD) ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడ్డాయి.
వివరాలు
20 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు దగ్ధం
దీంతో అక్కడ నిలిపి ఉంచిన 20 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కార్లలోని లిథియం-అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, వాటిని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అమెరికన్ సింగర్ ఒలివర్ ట్రీ(32)మృతి చెందాడు. ఆయన మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్‌కు వచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ గ్యాస్‌పర్ ప్రిమ్ డియాస్(గాస్పి), దర్శకుడు లూకాస్ విగ్నాల్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ లూకాస్ బ్రిటో చావెస్, అలాగే ఇద్దరు పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. 'లైఫ్ గోస్ ఆన్', 'మిస్ యూ' వంటి హిట్ పాటలతో ఒలివర్ ట్రీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
వివరాలు
సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం
ప్రమాదానికి ఒక రోజు ముందు రియో వీధుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడం గమనార్హం. ఒలివర్ ట్రీ ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బ్రెజిల్ ఏవియేషన్ అథారిటీ CENIPAతో పాటు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా పైలట్ల తప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా శకలాలు పార్కింగ్ యార్డులో పడటంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.