South Korea: స్మార్ట్ గ్లాసెస్‌తో పరీక్షల్లో మోసాలు.. దక్షిణ కొరియా కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో ఈ వారం నిర్వహించనున్న జాతీయ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కళ్లద్దాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పరీక్షల్లో మోసాలకు పాల్పడకుండా ఈ చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో జరిగిన మోసం తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.
వివరాలు
పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు: దక్షిణ కొరియా విద్యాశాఖ
అయితే పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని దక్షిణ కొరియా విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఆ దేశంలో విద్యా, ఉద్యోగ అవకాశాల పరంగా ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంటరీ విచారణలో విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ కీలక ప్రకటన చేశారు.
కాలేజ్ స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్ (CSAT)లో ప్రతి పరీక్ష సెషన్‌కు ముందు విద్యార్థులు ధరించే కళ్లద్దాలన్నింటినీ తనిఖీ చేస్తామని తెలిపారు.
స్మార్ట్ పరికరాలను ఈ ఏడాది జులైలోనే నిషేధిత వస్తువుల జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు.
వివరాలు
క్రిమినల్ చర్యల గురించి హెచ్చరిక బోర్డులు
స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఎదుటివారికి తెలియకుండా ఫొటోలు తీయడం,వీడియోలు రికార్డు చేయడం, మాటలను ఆడియో రూపంలో భద్రపరచడం సాధ్యమవుతోంది.
దీంతో పరీక్షల్లో ప్రశ్నపత్రాలను బయటకు పంపేందుకు వీటిని ఉపయోగించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రం బయట నిషేధిత పరికరాల వివరాలు,వాటిని ఉపయోగిస్తూ పట్టుబడితే ఎదురయ్యే క్రిమినల్ చర్యల గురించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
స్మార్ట్ పరికరాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం ఒక సిబ్బందిని నియమించనున్నారు.
అనుమానాస్పద పరికరాలను వెంటనే గుర్తించలేని పరిస్థితులు ఎదురైతే.. పరీక్ష కేంద్రాలు,స్థానిక విద్యాశాఖ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ మధ్య హాట్‌లైన్ ద్వారా సమాచారం చేరవేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
వివరాలు
ఇలా చేస్తే ఆ ఏడాది ఫలితాలు రద్దు
రేడియో సిగ్నల్ డిటెక్టర్ల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే అంశంపై నిపుణులతో చర్చిస్తామని మంత్రి చోయ్ తెలిపారు.
వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల్లో ఇలాంటి పరికరాలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
పరీక్ష సమయంలో స్మార్ట్ పరికరాలను ధరించినా, ఉపయోగించినా ఆ ఏడాది ఫలితాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తర్వాతి ఏడాది పరీక్ష రాయకుండా నిషేధం విధిస్తారు.
ప్రస్తుతం ఏడాది పాటు ఉన్న ఈ నిషేధాన్ని మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు పెంచేందుకు పార్లమెంటుతో కలిసి పనిచేస్తామని మంత్రి వెల్లడించారు.
పరీక్షల్లో మోసాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
వివరాలు
ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో మోసానికి పాల్పడిన అభ్యర్థి
ఇటీవల జరిగిన ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి మోసానికి పాల్పడినట్లు ఆదివారం అంగీకరించడం ఈ కఠిన చర్యలకు ప్రధాన కారణమైంది.
పరీక్ష సమయంలో మైక్రో కెమెరా సాయంతో ప్రశ్నలను ఫొటోలు తీసి,వాటిని ఏఐ టూల్‌కు పంపినట్లు ఆ అభ్యర్థి వెల్లడించాడు.
అనంతరం వచ్చిన సమాధానాలను స్మార్ట్‌ఫోన్‌లో చూసి పరీక్ష రాసినట్లు అంగీకరించాడు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా ప్రధాని హాన్ సియోంగ్-సూక్ కూడా స్పందించారు.
వివరాలు
ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో మోసానికి పాల్పడిన అభ్యర్థి
జాతీయ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల భద్రతను కాపాడేందుకు అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేస్తామని సోమవారం ప్రకటించారు.
ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠినమైన శిక్షలు విధించాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.