LOADING...
HIGH ALERT in Bangladesh: బాంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్లు,అగ్నిప్రమాదాలు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

HIGH ALERT in Bangladesh: బాంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్లు,అగ్నిప్రమాదాలు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం వరుస బాంబు పేలుళ్లు, వాహనాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢాకా నగర మధ్యలో వాహనాలను తగలబెట్టిన ఘటనలు స్థానిక మీడియాలో ప్రధానంగా వెలువడ్డాయి. మిర్‌పూర్‌లో ఉన్న గ్రామీన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద.. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌కు అనుబంధ సంస్థ.. చెందిన వ్యాపార సంస్థపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ధాన్మొండిలోని ఇబ్నె సినా హాస్పిటల్‌,మిడాస్ సెంటర్ దగ్గర క్రూడ్ బాంబు పేలుళ్లు సంభవించాయి. మరోవైపు, ఉత్తర బంగ్లాదేశ్‌లోని మయమెన్సింగ్ ప్రాంతంలో జరిగిన వాహన అగ్నిప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు.

వివరాలు 

భారతదేశం,పాకిస్తాన్‌లలోనూ బాంబు పేలుళ్లు

ఢాకాలోని మౌచాక్ జంక్షన్‌, బంగ్లాదేశ్ బేతార్ కార్యాలయం (ఆగార్గాన్‌), ఖిల్గాన్ ఫ్లైఓవర్‌, మిర్‌పూర్ షా ఆలీ మార్కెట్ ప్రాంతాల్లో కూడా పేలుళ్లు వినిపించినట్లు డైలీ స్టార్ పత్రిక పేర్కొంది. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కొన్ని నెలల ముందు చోటు చేసుకోవడం గమనార్హం. తాత్కాలిక ప్రభుత్వం నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించారు. ఇదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్‌లలోనూ బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం ఉద్రిక్తతను పెంచింది.

వివరాలు 

దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

అధికారులు ఈ దాడులను, నవంబర్ 13న జరగబోయే అంతర్జాతీయ నేర విచారణ ట్రైబ్యునల్‌ తీర్పుతో (తొలగింపబడ్డ ప్రధానమంత్రి షేక్ హసీనా కేసు) అనుసంధానంగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్‌ (DMP) ప్రధాన ప్రభుత్వ భవనాల వద్ద సమావేశాలపై నిషేధం విధించింది. బంగ్లాదేశ్ అవామీ లీగ్‌ పిలుపునిచ్చిన నిరసనల నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సహా భద్రతా బలగాలు నగరమంతా సోదాలు ప్రారంభించాయి.

వివరాలు 

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు

సోమవారం (నవంబర్ 10) ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన హ్యుందాయ్ i20 కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, ఇరవై మందికి గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం వాహనం హర్యానా రిజిస్ట్రేషన్‌లో ఉందని, కార్‌ మొదటి యజమాని మొహమ్మద్ సల్మాన్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ "అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. దోషులు తప్పించుకోలేరు" అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా "నేరస్థులను విడిచిపెట్టం, చట్టం ముందు నిలబెట్టుతాం" అని స్పష్టం చేశారు. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు.

వివరాలు 

ఇస్లామాబాద్‌లో కోర్టు పరిసరాల్లో పేలుడు

మంగళవారం(నవంబర్ 11)పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని జిల్లా న్యాయ సముదాయం(District Judicial Complex)పార్కింగ్‌ ఏరియాలో పార్క్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈఘటనలో 12మంది మరణించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఈ దాడులకు భారతదేశం కారణమని ఆరోపిస్తూ"భారతదేశం ప్రాయోజిత ఉగ్రవాద చర్యలు"అని వ్యాఖ్యానించారు. రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్"దేశం యుద్ధ స్థితిలో ఉంది"అని ప్రకటించారు. అయితే తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (పాకిస్తాన్ తాలిబాన్)మాత్రం ఈదాడిలో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. రాయిటర్స్ సమాచారం ప్రకారం,గతకొన్నేళ్లుగా పాకిస్తాన్ తాలిబాన్ ప్రధానంగా భద్రతా బలగాలపైనే దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణపౌరులు ఇస్లామాబాద్‌లో దశాబ్దం తర్వాత మొదటిసారి ఇలా దాడికి గురయ్యారని Armed Conflict Location & Event Data గ్రూప్ వెల్లడించింది.