XEC Covid Variant: ప్రపంచాన్ని భయపడుతున్న XEC కోవిడ్ వేరియంట్.. 27 దేశాలలో విజృంభణ
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడుతుందనుకుంటున్న వేళ, ఈ మహమ్మారి మరో రూపంలో మళ్లీ హడలెత్తిస్తోంది.
ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి సబ్‌వేరియంట్లుగా ఇప్పటికే పలుసార్లు మానవాళికి కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు "ఎక్స్‌ఈసీ" అనే కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ కనిపిస్తోంది. తొలిసారిగా ఈ వేరియంట్ జర్మనీలో గుర్తించబడింది.
ఆ తర్వాత అది యూకే, యుఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాపించింది.
నిపుణుల ప్రకారం, ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విస్తరిస్తోంది. డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్ దేశాల్లో ఈ వైరస్ విజృంభణ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
వివరాలు
శీతాకాలంలో విజృంభించే అవకాశం
ఈ ఎక్స్‌ఈసీ వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్‌గా గుర్తించారు.
లండన్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ, ఈ వేరియంట్ మరెన్ని వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాపించకపోయినా, టీకాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు అవసరమని సూచించారు.
ఈ వేరియంట్ ఎక్కువగా శీతాకాలంలో విజృంభించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
అదే విధంగా, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎరిక్ టోపోల్ ఈ వేరియంట్ ప్రభావం ఇప్పుడే మొదలయ్యిందని, ఇది తీవ్రరూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చని చెప్పారు.
అయినప్పటికీ, బూస్టర్ డోసులు, వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను అదుపులోకి తీసుకురాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
స్వచ్ఛమైన గాలిని పీల్చేలా చర్యలు
అమెరికా సెంటర్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీల్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎక్స్‌ఈసీ లక్షణాలు:
జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల లక్షణాలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.