London School: తిలకం పెట్టుకున్నందుకు.. లండన్ స్కూల్‌లో 8 ఏళ్ల విద్యార్థిపై వివక్ష
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల హిందూ విద్యార్థి తన సంప్రదాయ తిలకం ధరించడం కారణంగా వివక్ష ఎదుర్కొన్నట్టు స్థానికంగా గట్టిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ యాజమాన్యం బాలుడి తిలకం విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం కారణంగా, ఆ విద్యార్థి పాఠశాల మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రిటన్‌లోని హిందూ, భారతీయ సమూహాలకు ప్రాతినిధ్యం వహించే ఇన్‌సైట్ యూకే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎనిమిదేళ్ల విద్యార్థి తన మత సంప్రదాయానికి అనుగుణంగా తిలకం ధరించి పాఠశాలకు వెళ్లటంతో యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడి మతపరమైన ఆచారాల గురించి పాఠశాల సిబ్బంది నిరంతరం పరిశీలించేవారు.
వివరాలు
బ్రిటన్ చట్టాల ప్రకారం మత వివక్ష
విద్యార్థులు ఆడుకునే సమయంలో హెడ్‌టీచర్ ప్రత్యేకంగా ఆ బాలుడిపై దృష్టి సారించేవారు,దాంతో భయపడిపోయిన ఆ విద్యార్థి ఇతరులతో ఆడుకోవడానికి ఇబ్బందిపడినట్లు యూకే సంస్థ వెల్లడించింది. ఏ విద్యార్థి తన విశ్వాసం వల్ల ఒంటరితనాన్ని ఎదుర్కోవడం తగదని పేర్కొంది. ఇలాంటి ఘటనలు విద్యార్థుల మానసికభద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని,భద్రతాపరంగా ప్రశ్నలు లేవనెత్తుతాయని విమర్శించింది. విద్యార్థి తల్లిదండ్రులు తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యాన్ని వివరించడానికి ప్రయత్నించినప్పటికీ,అటువంటి ప్రయత్నం ఫలితం ఇవ్వలేదని వెల్లడించారు. దీంతో ఆచిన్నారి పాఠశాల మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇన్‌సైట్ యూకే పేర్కొంది. ఈకేసు నిజమైతే,బ్రిటన్ చట్టాల ప్రకారం మత వివక్షగా పరిగణించబడుతుంది. అంతేకాక,ఈ వివక్షాపూరిత చర్యల కారణంగా ఇప్పటివరకు కొంతమంది విద్యార్థులు స్కూల్ విడిచి వెళ్లినట్టు యూకేసంస్థ ఆగ్రహం వ్యక్తంచేసింది.