LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం వెల్లడించారు. ఈ దాడిలో మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌గా యూనస్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఎక్స్‌ (ట్విటర్‌)లో చేసిన పోస్టులో యూనస్, "మైమెన్సింగ్ జిల్లాలోని భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను దారుణంగా కొట్టి చంపిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ బ్యాటాలియన్ (RAB) ఏడుగురిని అనుమానితులుగా అరెస్ట్ చేసింది" అని తెలిపారు.

Details

అరెస్టు అయిన వ్యక్తులు వీరే

అరెస్ట్ అయిన వారిలో ఎం.డి. లిమోన్ సర్కార్‌(19), ఎం.డి. తారెక్ హొస్సేన్‌(19), ఎం.డి. మాణిక్ మియా(20), ఎర్షాద్ అలీ (39), నిజుమ్ ఉద్దిన్‌ (20), అలొంగీర్ హొస్సేన్‌ (38), ఎం.డి. మిరాజ్ హొస్సేన్ అకోన్‌ (46) ఉన్నారని వివరించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం మైమెన్సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్‌ను గుంపుగా దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తీవ్ర కలకలం రేపింది. అతడిని కొట్టి, చెట్టుకు కట్టేసి, అనంతరం కాల్చి చంపినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు బంగ్లా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ హింసాత్మక ఘటనపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు.

Details

ఎవరిని వదిలిపెట్టం

"మైమెన్సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యూ బంగ్లాదేశ్‌లో ఈ తరహా హింసకు ఎలాంటి స్థానం లేదు. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఒక్కరినీ వదిలిపెట్టం" అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, కొన్ని తీవ్రవాద గుంపులు హింసను ప్రోత్సహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం కీలక దశలో చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన గుండా వెళ్తోందని, గందరగోళాన్ని సృష్టించి దేశాన్ని అశాంతి వైపు నెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని యూనస్ హెచ్చరించారు.

Advertisement