Bombing of Hiroshima: హిరోషిమా విధ్వంసానికి 81 ఏళ్లు.. అణు ముప్పుపై ప్రపంచ దేశాలకు జపాన్ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటితో (గురువారం) 81 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌లో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని నిర్వహించి, అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందికి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, అణ్వాయుధాల వినియోగంపై నెలకొన్న ఆందోళనల మధ్య ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. 1945 ఆగస్టు 6న ఉదయం 8:15 గంటలకు హిరోషిమాపై అణుబాంబు పేలింది. అదే సమయానికి కార్యక్రమంలో పాల్గొన్న వారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి బాధితులను స్మరించుకున్నారు. అనంతరం హిరోషిమా మేయర్ కజుమీ మట్సుయి శాంతి ప్రకటనను విడుదల చేశారు.
వివరాలు
అణ్వాయుధాల వల్ల జరిగే విధ్వంసాన్ని తక్కువ చేయొద్దని హిరోషిమా మేయర్ హెచ్చరిక
అణ్వాయుధాల వల్ల సంభవించే భయంకరమైన విధ్వంసాన్ని ప్రపంచం ఎన్నటికీ మరవకూడదని ఆయన అన్నారు.
దేశాలు పరస్పర సహకారం, బహుళపాక్షిక చర్చల ద్వారా అణ్వస్త్రాల వ్యాప్తిని అరికట్టి, వాటి పూర్తి నిర్మూలన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అణ్వాయుధాల అమానవీయ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి, స్వప్రయోజనాల కోసం హింసను సమర్థిస్తే మరో హిరోషిమా లేదా నాగసాకి వంటి విషాదం పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అణుబాంబు దాడిని ప్రత్యక్షంగా అనుభవించి ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, అణ్వాయుధాలు లేని ప్రపంచ నిర్మాణంలో యువత ముందుకు రావాలని మేయర్ కోరారు.
శాంతి సందేశాన్ని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత కూడా యువతపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
జపాన్ అణు విధానాన్ని మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలపై పెరుగుతున్న వ్యతిరేకత
1945లో హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడి కారణంగా అదే ఏడాది చివరి నాటికి సుమారు 1.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం మూడు రోజులకే అమెరికా నాగసాకి నగరంపైనా మరో అణుబాంబును ప్రయోగించింది.
అణు దాడులను ఎదుర్కొన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా నిలిచిన జపాన్ అప్పటి నుంచి మూడు అణు వ్యతిరేక సూత్రాలను అమలు చేస్తోంది.
వాటి ప్రకారం అణ్వాయుధాలను దేశంలో కలిగి ఉండకూడదు, ఉత్పత్తి చేయకూడదు, దేశ భూభాగంలోకి అనుమతించకూడదు.
అయితే ఇటీవలి కాలంలో ఈ విధానాలపై జపాన్‌లో కొత్త చర్చ మొదలైంది.
షిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం, ప్రధాని సనే టకాయిచి నేతృత్వంలోని అధికార పక్షంలో మూడు అణు వ్యతిరేక సూత్రాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
వివరాలు
డైట్‌కు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను పంపించిన 36 ప్రిఫెక్చర్‌లకు చెందిన 128 స్థానిక శాసనసభలు
ముఖ్యంగా జపాన్ భూభాగంలోకి అణ్వాయుధాల ప్రవేశాన్ని అనుమతించే నిబంధనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెలువడుతున్న వార్తలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి.
ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ జపాన్‌లోని 36 ప్రిఫెక్చర్‌లకు చెందిన 128 స్థానిక శాసనసభలు దేశ పార్లమెంట్ అయిన డైట్‌కు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను పంపించాయి.
ఈ స్థాయిలో స్థానిక సంస్థల నుంచి వ్యతిరేక తీర్మానాలు రావడం జపాన్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.