Hong Kong: జననాల రేటు పెంచేందుకు హాంకాంగ్ 11 కొత్త పథకాలు..
ఈ వార్తాకథనం ఏంటి
హాంగ్ కాంగ్‌లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం 11 కొత్త చర్యలను ప్రకటించింది. పిల్లలను కనాలనుకునే కుటుంబాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చురుగ్గా జోక్యం చేసుకుంటుందని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కా-చియు తెలిపారు. ఇప్పటివరకు అనుసరిస్తున్న పెద్దగా జోక్యం చేసుకోని విధానానికి భిన్నంగా,కుటుంబాలను ప్రోత్సహించే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత విధానంలో కీలకమైన నవజాత శిశు నగదు బోనస్ పథకాన్ని మరో మూడేళ్లు పొడిగించనున్నారు. ఈ పథకం అసలు గడువు అక్టోబర్ 24తో ముగియాల్సి ఉంది.అయితే, ఇప్పుడు దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కుటుంబంలో రెండో బిడ్డ, ఆ తర్వాత పుట్టే పిల్లలకు నగదు ప్రోత్సాహకాన్ని 20,000 హాంకాంగ్ డాలర్ల నుంచి 30,000 డాలర్లకు పెంచనున్నారు.
వివరాలు
బిడ్డ పుడితే ఇల్లు కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు
అదనంగా పుట్టే పిల్లల కోసం పన్ను రాయితీని కూడా 1,40,000 డాలర్ల నుంచి 1,60,000 డాలర్లకు పెంచనున్నారు.
ఈ రాయితీల వల్ల తొలి ఏడాది ప్రభుత్వ ఆదాయంపై 15 మిలియన్ హాంకాంగ్ డాలర్ల ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేశారు.
26 ఏళ్లలో ఈ మొత్తం 200 మిలియన్ డాలర్లకు చేరొచ్చని తెలిపారు. అయితే, ఈ ఆర్థిక భారం భరించగలిగిన స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు.
కుటుంబాలకు ఇళ్లకు సంబంధించిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
బిడ్డ పుట్టడానికి ఒక సంవత్సరం ముందు నుంచి, పుట్టిన తర్వాత రెండేళ్లలోపు ఇల్లు కొనుగోలు చేసే కుటుంబాలకు గరిష్ఠంగా 20,000 హాంకాంగ్ డాలర్ల వరకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నారు.
వివరాలు
కుటుంబాలకు గృహ రుణాల్లో భారీ వెసులుబాటు
ప్రభుత్వేతర గృహాల్లో నివసించే కుటుంబాలు బిడ్డ పుట్టిన తర్వాత హోమ్ ఓనర్‌షిప్ స్కీమ్ (HOS) కింద సబ్సిడీ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తే.. గృహ రుణంలో ఆస్తి విలువకు 95 శాతం వరకు రుణం పొందే అవకాశం కల్పించనున్నారు.
దీంతో ముందస్తు చెల్లింపు భారం తగ్గనుంది. కొన్ని HOS ఇళ్లను తిరిగి విక్రయించేందుకు ఉన్న పరిమితి కాలాన్ని కూడా 15 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గించనున్నారు.
దీనివల్ల కుటుంబాలు తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఇళ్లకు మారేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
హాంకాంగ్‌లో జననాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
2024లో జననాల సంఖ్య 35,723కు పెరిగినప్పటికీ, 2025లో అది 31,000కు కొద్దిగా మించి నమోదైంది.
వివరాలు
జననాల తగ్గుదలపై నిపుణుల స్పందన..
ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో కేవలం 19,255 జననాలు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తక్కువ.
హాంకాంగ్ ఫ్యూచర్ ఎకానమీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ వాంగ్ ఈ చర్యలపై స్పందించారు.
యువతలో సొంత ఇళ్ల యాజమాన్యం తగ్గుతున్న నేపథ్యంలో లక్ష్యిత గృహ రుణ సాయం సరైన దిశలో తీసుకున్న అడుగేనని ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌తో అన్నారు.
అయితే, దరఖాస్తు చేసే రోజున మూడేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు ఉన్న కుటుంబాలకే ఈ ప్రయోజనాలు పరిమితం కావడం వల్ల అందరికీ ఉపయోగం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
కుటుంబాల సందేహాలు.. యువతకు ఉపాధి ప్రోత్సాహకాలు
తక్కువ, మధ్యతరగతి ఆదాయ కుటుంబాలు కూడా ఈ పథకాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
పిల్లల పెంపకం ఖర్చులు, పాఠ్యపుస్తకాల వ్యయం, చిన్నారుల సంరక్షణ కేంద్రాల కొరత వంటి సమస్యల ముందు నగదు బోనస్‌లు దీర్ఘకాలికంగా పెద్దగా ఉపశమనం కలిగించవని వారు అభిప్రాయపడుతున్నారు.
చిన్నారుల సంరక్షణ సౌకర్యాల కొరత కారణంగా కొందరు తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు చేయలేకపోతున్నారని చెబుతున్నారు.
యువత ఉపాధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. 2027 తొలి త్రైమాసికం నుంచి రెండేళ్లపాటు 10,000 కొత్త పూర్తికాల యువ ఉద్యోగాలకు నెలకు గరిష్ఠంగా 6,000 హాంకాంగ్ డాలర్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది.
అదనంగా 10,000 STEM ఇంటర్న్‌షిప్‌లు, నిర్మాణ రంగంలో 10,000 శిక్షణ అవకాశాలను అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.