Crashed plane: పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
పెరూలోని ప్రపంచ ప్రఖ్యాత నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ పర్యాటకులతో సైట్‌సీయింగ్ కోసం వెళ్తున్న ఓ చిన్న విమానం నాజ్కా నగరం వెలుపల కూలిపోవడంతో 13 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. పురాతన నాజ్కా లైన్స్‌ను విహంగ వీక్షణం చేయించేందుకు ఈ విమానం బయలుదేరిందని వెల్లడించింది.
వివరాలు
నాజ్కా లైన్స్ వీక్షణకు బయలుదేరిన విమానం
శతాబ్దాల క్రితం స్థానిక గిరిజన తెగలు పెరూ ఎడారిలో చెక్కిన భారీ భౌగోళిక చిత్రాలే నాజ్కా లైన్స్. జంతువులు, పక్షులు, రేఖాగణిత ఆకృతులను పోలిన ఈ జియోగ్లిఫ్‌లను భూమిపై నుంచి కాకుండా విమానంలో లేదా ప్రత్యేక పరిశీలనా టవర్ల నుంచి స్పష్టంగా వీక్షించవచ్చు.
ప్రమాదానికి గురైన విమానం సమీపంలోని ఇకా నగరం నుంచి బయలుదేరింది. దీనిని పెరూ విమానయాన సంస్థ ఏరోడియానా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
11 మంది విదేశీ పర్యాటకులు మృతి
గత 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలతో నాజ్కా లైన్స్‌పై సైట్‌సీయింగ్ సేవలు అందిస్తున్నట్లు ఏరోడియానా సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు పెరూ వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అజెన్సియా ఆండినా తెలిపిన వివరాల ప్రకారం, మృతుల్లో ఏడుగురు ఇటలీకి చెందినవారు, ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పెయిన్ పర్యాటకులు ఉన్నారు.
ఈ ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పెరూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.