LOADING...
B 52 Bomber: ఘోర విషాదం.. కూలిన బీ-52 బాంబర్‌ విమానం, 8 మంది దుర్మరణం
ఘోర విషాదం.. కూలిన బీ-52 బాంబర్‌ విమానం, 8 మంది దుర్మరణం

B 52 Bomber: ఘోర విషాదం.. కూలిన బీ-52 బాంబర్‌ విమానం, 8 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌గా అధికారులు గుర్తించారు. ఎడ్వర్డ్స్‌ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో భారీ విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గురైన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ అమెరికా వాయుసేన వద్ద సేవలందిస్తున్న అత్యంత పాత వ్యూహాత్మక బాంబర్‌ విమానాల్లో ఒకటి. 1955లో అమెరికా వైమానిక దళంలో చేరిన ఈ విమానం దశాబ్దాలుగా అనేక కీలక యుద్ధాల్లో సేవలందిస్తోంది.

వివరాలు

వ్యూహాత్మక ఆపరేషన్లలో ఈ విమాన వాడకం

మొత్తం 744 బీ-52 విమానాలను తయారుచేయగా, చివరి బీ-52హెచ్‌ వేరియంట్‌ను 1962లో ఉత్పత్తి చేశారు. దీంతో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈ విమానాల వయస్సు ఎంత ఎక్కువో అర్థమవుతోంది. బీ-52హెచ్‌ స్ట్రాటోఫోర్ట్రెస్‌ ఒకేసారి 20 క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికా సైన్యం అవసరాలకు అనుగుణంగా వివిధ యుద్ధ, వ్యూహాత్మక ఆపరేషన్లలో దీనిని వినియోగిస్తోంది. కోల్డ్‌వార్‌ కాలంలో అణ్వాయుధాలను మోసుకెళ్లి ప్రయోగించగల బాంబర్‌గా ఇది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేయగా, వియత్నాం యుద్ధంలో విస్తృతంగా బాంబు దాడులకు ఉపయోగించారు.

వివరాలు

యుద్దరంగంలో వ్యూహాత్మక దాడులు

ఇటీవల ఇరాన్‌పై నిర్వహించిన దాడుల్లో కూడా ఈ బాంబర్‌ విమానాలను అమెరికా వినియోగించింది. ఆకారంలో అత్యంత భారీగా కనిపించే స్ట్రాటోఫోర్ట్రెస్‌ విమానాలు యుద్ధరంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్‌ ఎయిర్‌ సపోర్ట్‌, కౌంటర్‌ ఎయిర్‌ మిషన్లు, సముద్ర ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తాయి. 1990లలో ఇరాక్‌పై అమెరికా చేపట్టిన సైనిక ఆపరేషన్ల సమయంలో ప్రయోగించిన మొత్తం బాంబుల్లో దాదాపు 40 శాతం బీ-52 విమానాల నుంచే ప్రయోగించబడినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనివల్ల అమెరికా వైమానిక దళం ఈ బాంబర్‌లపై ఎంతగా ఆధారపడుతోందో స్పష్టమవుతోంది.

Advertisement