LOADING...
Helicopter Crash: పెళ్లైన కొన్ని గంటలకే విషాదం..హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి
పెళ్లైన కొన్ని గంటలకే విషాదం..హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

Helicopter Crash: పెళ్లైన కొన్ని గంటలకే విషాదం..హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

వందలాది మంది బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుక.. కొద్ది గంటల్లోనే తీవ్ర విషాదంగా మారింది. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన నూతన వధూవరుల జీవితంలో ఊహించని దుర్ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగి పది గంటలు కూడా గడవక ముందే జరిగిన హెలికాప్టర్ ప్రమాదం వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ప్రమాదంలో యువ పైలట్ మృతి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ డేవ్ ఫైజీ (25) ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడగా,హెలికాప్టర్‌ను నడుపుతున్న ప్రధాన పైలట్ కూడా ప్రమాదంలో మరణించాడు.

వివరాలు 

అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే..

డేవ్ తల్లిదండ్రులు జార్జ్,ఫీబా కొన్నేళ్ల క్రితం కేరళలోని ఎర్నాకుళం జిల్లా మువట్టుపుజ ప్రాంతం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. వధువు జెస్ని కుటుంబానికి కూడా కేరళలోని అలప్పుళ జిల్లాతో అనుబంధం ఉంది. శుక్రవారం డాసన్‌విల్లే సమీపంలోని 'ది రివెరె' వెడ్డింగ్ హాల్‌లో డేవ్, జెస్నిల వివాహం ఘనంగా జరిగింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వివాహ వేడుకలు ముగిసిన అనంతరం ఈ కొత్త జంట అట్లాంటా డౌన్‌టౌన్‌లోని హోటల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే అప్పటికే వాతావరణ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయి. దట్టమైన పొగమంచు,భారీ వర్షం కారణంగా దృశ్యమానత బాగా తగ్గిపోయింది. కమర్షియల్ పైలట్ అయిన డేవ్ స్వయంగా ఈ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

వివరాలు 

శిథిలాల మధ్య ఐదు గంటలు

ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించడం సురక్షితం కాదని, ప్రస్తుతం టేకాఫ్ చేయవద్దని తన తండ్రికి స్పష్టంగా చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ప్రైవేట్ హెలికాప్టర్ పైలట్ మాత్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మబలికాడు. దీంతో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో రాబిన్సన్ R66 హెలికాప్టర్ టేకాఫ్ అయింది. కానీ కొద్ది సేపటికే డాసన్‌విల్లే నైరుతి దిశలోని అడవులు, కొండల ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం తీవ్రతకు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమై చెట్ల మధ్య కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన జెస్ని శిథిలాలు, విరిగిపోయిన చెట్ల కింద చిక్కుకుపోయింది. దాదాపు ఐదు గంటల పాటు ఆమె అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉండిపోయింది.

Advertisement

వివరాలు 

భావోద్వేగానికి గురైన డేవ్ తండ్రి జార్జ్ ఫైజీ

ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ డేవ్ తండ్రి జార్జ్ ఫైజీ భావోద్వేగానికి గురయ్యారు. స్పృహలోకి వచ్చిన తర్వాత జెస్ని తన చుట్టూ శిథిలాలు, అడవి మాత్రమే కనిపించాయని చెప్పిందన్నారు. ఆమెపై డేవ్ పడిపోయి ఉండటంతో అతడిని లేపేందుకు ప్రయత్నించిందని, నర్సుగా పనిచేస్తున్న ఆమె అతని పరిస్థితిని పరిశీలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిందని తెలిపారు.

Advertisement

వివరాలు 

గంటల తరబడి సాగిన సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడం, సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో సహాయక చర్యలు కష్టసాధ్యమయ్యాయి. రెస్క్యూ బృందాలు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి ఆఫ్‌రోడ్ వాహనాల సహాయంతో జెస్నిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాయి. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. జెస్ని శరీరమంతా తీవ్ర గాయాలు కాగా, మానసికంగా కూడా తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వివరాలు 

NTSB విచారణ ప్రారంభం

ఈ విషాద ఘటనపై అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి దారితీసిన కారణాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, విమానయాన భద్రతా అంశాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన అమెరికాలోని భారతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement