Loading...
Houthis: క్షిపణులు కాదు.. ఎప్‌స్టీన్ కేసుతో సౌదీని టార్గెట్ చేస్తున్న హౌతీలు
క్షిపణులు కాదు.. ఎప్‌స్టీన్ కేసుతో సౌదీని టార్గెట్ చేస్తున్న హౌతీలు

Houthis: క్షిపణులు కాదు.. ఎప్‌స్టీన్ కేసుతో సౌదీని టార్గెట్ చేస్తున్న హౌతీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లో కీలక ప్రాంతాలపై పట్టు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు తమ ప్రత్యర్థి సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా ప్రచారానికి తెరతీశారు. ఇప్పటివరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే హౌతీలు.. ఇప్పుడు అమెరికాకు చెందిన దివంగత ఫైనాన్షియర్, లైంగిక నేరాల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారాన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ వివాదం ద్వారా సౌదీ అరేబియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని 'న్యూయార్క్ టైమ్స్' తన కథనంలో వెల్లడించింది.

వివరాలు 

సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు కాబా వస్త్రాలు ఇచ్చారంటూ ఆరోపణలు

అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాలపై హౌతీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ముఖ్యంగా సౌదీ రాజకుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు ఎప్‌స్టీన్‌కు ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మక్కాలోని కాబా చిత్రాలతో కూడిన అలంకరణ వస్త్రాలను బహుమతిగా ఇచ్చారనే నివేదికలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

తాము ఇస్లాం ధర్మాన్ని కాపాడేవారమని చెప్పుకునే హౌతీలు.. ఈ అంశాన్ని ఉపయోగించి సౌదీ అరేబియా ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివరాలు 

మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు: సౌదీ అరేబియా

యెమెన్‌లో సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వానికి, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య చాలాకాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో పాటు తమ ప్రత్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు హౌతీలు వివిధ ప్రచార మార్గాలను అనుసరిస్తున్నారు.

వీడియోలు, పాటలు, ప్రసంగాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పోస్టుల ద్వారా తమ వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రచారంలో భాగమయ్యాయి.

ఇటీవల మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారని సౌదీ అరేబియా ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను హౌతీలు ఖండించారు. దీనిపై స్పందించిన హౌతీ అధ్యక్షుడు మహదీ అల్‌-మషత్‌.. ఎప్‌స్టీన్‌కు కాబా వస్త్రాలను బహుమతిగా ఇచ్చినవారే నిజంగా మక్కాను లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎప్‌స్టీన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సౌదీ అరేబియాను విమర్శించే వీడియో

ఈ వ్యాఖ్యల ద్వారా సౌదీ అరేబియాపై విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను హౌతీ మద్దతుదారులు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు.

ఈ ప్రచారంలో సోషల్ మీడియా ప్రముఖులు, సంగీత కళాకారులు కూడా పాల్గొంటున్నారు.

యెమెన్‌కు చెందిన హాస్యనటుడు ముస్తఫా అల్‌-మొమారి.. ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌)లో 27 లక్షలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు.

ఆయన ఎప్‌స్టీన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సౌదీ అరేబియాను విమర్శించే వీడియోను రూపొందించారు.

మరోవైపు, సంప్రదాయ సంగీత విద్వాంసుడు కూడా ఇదే అంశంపై పాటను రూపొందించారు.

అయితే కాబా వస్త్రాలకు సంబంధించిన నివేదికలపై గానీ, హౌతీలు చేస్తున్న ఆరోపణలపై గానీ సౌదీ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

హౌతీలను ప్రశంసించిన అమెరికా పాడ్‌కాస్టర్

హౌతీ ఉద్యమ నాయకుడు అబ్దుల్‌-మాలిక్ అల్‌-హౌతీ సైతం తన ప్రసంగాల్లో ఎప్‌స్టీన్ వ్యవహారాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ పత్రాలు నాయకులు,ఉన్నత వర్గాలకు శిక్షణ ఇచ్చే జియోనిస్ట్ కేంద్రం ఉనికిని బయటపెట్టాయని ఆయన ఆరోపించారు.

అయితే ఇవి ఆయన చేసిన వ్యాఖ్యలు,ఆరోపణలు మాత్రమేనని గమనించాలి.

హౌతీలు చేపట్టిన ఈ ప్రచారం అంతర్జాతీయంగానూ కొంతమంది దృష్టిని ఆకర్షిస్తోంది.

అమెరికాకు చెందిన ప్రముఖ పాడ్‌కాస్టర్ జేక్ షీల్డ్స్..హౌతీలను ప్రశంసిస్తూ,తాను వారికి పెద్ద అభిమానినని,వారు ఎంతో శక్తిమంతులని వ్యాఖ్యానించారు.

ఎప్‌స్టీన్ కేసు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో,దానికి సంబంధించిన వివాదాలను తమ ప్రాంతీయ రాజకీయ, ఆధిపత్య పోరులో ప్రచార సాధనంగా హౌతీలు ఉపయోగించుకుంటున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT