Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల విరుచుకుపాటు.. రియాద్ విమానాశ్రయం సహా ఆరు లక్ష్యాలపై దాడులు!
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై శనివారం దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. తమ లక్ష్యాల్లో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరామ్‌కో చమురు క్షేత్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని హూతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ వెల్లడించారు. శుక్రవారం యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్‌లో ఓ మార్కెట్‌పై సౌదీ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్‌లను ఉపయోగించి దాడులు చేసినట్లు పేర్కొన్నారు.
వివరాలు
రియాద్ విమానాశ్రయం, ఆరామ్‌కో చమురు స్థావరాలే లక్ష్యం
తమ దాడులకు సంబంధించిన వివరాలను యాహ్యా సరీ వెల్లడించారు. "మొదటి ఆపరేషన్‌లో రియాద్‌లోని ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆరామ్‌కోకు చెందిన చమురు నిల్వ ట్యాంకులు, ఒక డిస్టిలేషన్ టవర్‌ను లక్ష్యంగా చేసుకున్నాం.
ఆ ఆపరేషన్‌లో విజయం సాధించిన తర్వాత ఖురైస్ ప్రాంతంలోని చమురు స్థావరాలపై క్షిపణులు ప్రయోగించాం. మూడో దాడిని దవాద్మి ప్రాంతంలోని చమురు పంపింగ్ స్టేషన్ నంబర్ 8పై నిర్వహించాం.
మిగిలిన మూడు ఆపరేషన్లలో సౌదీ సైనిక సిబ్బంది, వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. నజ్రాన్‌లోని సౌదీ నేషనల్ గార్డ్ శిబిరంపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించాం.
ఈ దాడుల కారణంగా అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని యాహ్యా సరీ పేర్కొన్నారు.
వివరాలు
24 గంటల్లో 105 దాడులు చేశారంటూ ఆరోపణలు
మరోవైపు, గత 24 గంటల్లో సౌదీ దళాలు యెమెన్‌లోని 105 ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు చేపట్టాయని యాహ్యా సరీ ఆరోపించారు.
ఈ దాడుల్లో 30 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.