Loading...
Aramco: సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన
సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన

Aramco: సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
Jul 26, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతుతో ఉన్న హూతీ తిరుగుబాటుదారుల మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో హూతీలు ఎర్ర సముద్రంలో సముద్ర దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని ప్రముఖ చమురు సంస్థ సౌదీ అరామ్‌కోకు చెందిన రాస్ తనురా ప్రాంతంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకదానిపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ రిఫైనరీనే లక్ష్యంగా చేసుకుని దాడి నిర్వహించినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

వివరాలు

యెమెన్‌పై సౌదీ అరేబియా చేపట్టిన వైమానిక దాడులు..

యెమెన్‌పై సౌదీ అరేబియా చేపట్టిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్య చేపట్టినట్లు వారు వెల్లడించారు.

అంతేకాకుండా, యెమెన్‌పై విధించిన దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

డ్రోన్ దాడి అనంతరం రిఫైనరీ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా రిఫైనరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం.

అయితే ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టం గురించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

వివరాలు

చమురు రవాణాపై మరింత ముప్పు..

అమెరికా-ఇరాన్ ఘర్షణల ప్రభావంతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఇరాన్ ఆటంకం కలిగించడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా సౌదీ అరేబియాకు చెందిన నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హూతీలు ప్రకటించడం కొత్త ఆందోళనకు దారితీసింది.

ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో అనుసంధానించే ఈ జలసంధి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో అత్యంత ప్రాధాన్యమైన మార్గాల్లో ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురురవాణాలో 12 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుండటంతో, వాణిజ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ADVERTISEMENT