LOADING...
patient zero: అరుదైన పక్షి కోసం వెళ్లి హంటా వైరస్‌ బారిన శాస్త్రవేత్త దంపతుల మృతి
అరుదైన పక్షి కోసం వెళ్లి హంటా వైరస్‌ బారిన శాస్త్రవేత్త దంపతుల మృతి

patient zero: అరుదైన పక్షి కోసం వెళ్లి హంటా వైరస్‌ బారిన శాస్త్రవేత్త దంపతుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుదైన పక్షి జాతులను చూడాలనే ఆసక్తి ఓ డచ్‌ శాస్త్రవేత్త దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. హంటా వైరస్‌ బారిన పడి మరణించిన తొలి వ్యక్తిగా డచ్‌ పక్షిశాస్త్రవేత్త లియో షిల్పెరూర్డ్‌(70) గుర్తింపబడ్డారు. ఈ వైరస్‌ కారణంగానే ఆయనతో పాటు భార్య మిర్జామ్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఎంవీ హోండియస్‌ అనే క్రూజ్‌ నౌకలో ప్రయాణించారు. అరుదైన పక్షులను వీక్షించేందుకు లియో,మిర్జామ్‌ దంపతులు ఐదు నెలల దక్షిణ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో మార్చి 27న అర్జెంటీనాలోని ఉషువాయా నగరశివార్లలో ఉన్న భారీ చెత్తకుప్ప ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ కనిపించే డార్విన్‌ కారకారా అనే అరుదైన పక్షిని చూడటానికి లియో చాలా సేపు కుళ్లిపోయిన వ్యర్థాల మధ్యే వేచి ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

నౌకలోనే భార్య ,భర్త మృతి 

ఆ తర్వాత నాలుగు రోజులకే వీరిద్దరూ వంద మందికి పైగా ప్రయాణికులతో కలిసి ఎంవీ హోండియస్‌ నౌకలో ప్రయాణం ప్రారంభించారు. అయితే ఏప్రిల్‌ 6న లియోకు జ్వరం,తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో ఐదు రోజుల తర్వాత నౌకలోనే ఆయన మరణించాడు. భర్త మృతదేహంతో ఏప్రిల్‌ 24న అట్లాంటిక్‌ మహాసముద్రంలోని సెయింట్‌ హెలెనా ద్వీపంలో దిగిన మిర్జామ్‌, అక్కడి నుంచి దక్షిణాఫ్రికా మీదుగా నెదర్లాండ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ప్రయాణం మధ్యలోనే ఆమె ఆరోగ్యం క్షీణించి విమానాశ్రయంలో కుప్పకూలింది. మరుసటి రోజే ఆమె కూడా మరణించింది. మే 4న నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ దంపతులిద్దరూ హంటా వైరస్‌ సోకడంతోనే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

వివరాలు 

వైరస్‌ తీవ్రరూపం

అర్జెంటీనాలోని భారీ చెత్తకుప్ప వద్ద ఉన్న ఎలుకల రెట్టల నుంచి వెలువడిన దుర్వాసన ద్వారా వైరస్‌ కణాలు లియో శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అదే వైరస్‌ తీవ్రరూపం దాల్చినట్లు వెల్లడించారు. నౌకలో మొదటగా లియోనే అస్వస్థతకు గురయ్యాడని, అనంతరం ఆయన భార్యతో పాటు మరికొందరు ప్రయాణికులకు కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందికి హంటా వైరస్‌ నిర్ధారణ అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

నౌకలో 23 దేశాలకు చెందిన 146 మంది

వారిలో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ఈ నౌకలో 23 దేశాలకు చెందిన 146 మంది ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం నౌక స్పెయిన్‌కు చెందిన క్యానరీ దీవుల సమీపానికి చేరుకుంది. వైరస్‌ సోకని 94 మంది ప్రయాణికులు, సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా వారి స్వదేశాలకు తరలించారు. నౌక నేడు నెదర్లాండ్స్‌కు చేరుకోనుంది.

Advertisement