Loading...
Iran: ఇరాన్ కొత్త సైబర్ ఎత్తుగడ.. అమెరికా సైనికుల ఫోన్లపై నిఘా!
ఇరాన్ కొత్త సైబర్ ఎత్తుగడ.. అమెరికా సైనికుల ఫోన్లపై నిఘా!

Iran: ఇరాన్ కొత్త సైబర్ ఎత్తుగడ.. అమెరికా సైనికుల ఫోన్లపై నిఘా!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్ల మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు డేటా రోమింగ్ వ్యవస్థతో పాటు పాత టెలికాం మౌలిక సదుపాయాల్లోని బలహీనతలను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొబైల్ గూఢచర్యాన్ని అధ్యయనం చేసే మొబైల్ సర్వైలెన్స్ మానిటర్ సంస్థ పరిశీలనలో ఈ అంశాలు బయటపడినట్లు సమాచారం. పరిశోధకుల వివరాల ప్రకారం, మధ్యప్రాచ్యంలోని నిర్దిష్ట మొబైల్ ఫోన్ల స్థానాన్ని గుర్తించేందుకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు పంపినట్లు గుర్తించారు. విదేశాల్లో రోమింగ్‌లో ఉన్న నిర్దిష్ట మొబైల్ ఫోన్ల స్థానాన్ని గుర్తించేందుకు ఈ అభ్యర్థనలు పంపినట్లు గుర్తించారు. ఈ వివరాలు సమన్వయంతో నిర్వహించిన సైబర్ దాడి ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని సంస్థ వ్యవస్థాపకుడు, సైబర్ భద్రతా నిపుణుడు గ్యారీ మిల్లర్ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

వివిధ దేశాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన సైనికులు

అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ సైబర్ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.

ఆ సమయంలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కూడా చేపట్టింది.

ఈ నేపథ్యంలో మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా అమెరికా సిబ్బంది కదలికలను గుర్తించే ప్రయత్నాలు జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన వేలాది మంది సైనికులు వివిధ దేశాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళం ఐదో ఫ్లీట్ కేంద్రం పరిసరాల్లో ఎస్‌ఎస్‌7 (SS7) పింగ్స్ పేరుతో పిలిచే ప్రత్యేక నెట్‌వర్క్ అభ్యర్థనలు భారీగా నమోదైనట్లు పరిశోధకులు తెలిపారు.

వివరాలు 

రోమింగ్ ఒప్పందాలను ఉపయోగించి అమెరికా సిబ్బంది ఫోన్ల లొకేషన్‌ను గుర్తించేందుకు ఇరాన్ ప్రయత్నం 

ఈ విధానం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న ఫోన్ యాక్టివ్‌గా ఉందా? రోమింగ్‌లో ఉందా? ప్రస్తుతం ఎక్కడ ఉంది? వంటి వివరాలను గుర్తించే అవకాశం ఉంటుందని వారు వివరించారు.

గల్ఫ్ ప్రాంత అధికారుల అభిప్రాయం ప్రకారం, స్థానిక టెలికాం కంపెనీలతో ఉన్న రోమింగ్ ఒప్పందాలను ఉపయోగించి అమెరికా సిబ్బంది ఫోన్ల లొకేషన్‌ను గుర్తించేందుకు ఇరాన్ లేదా దాని మద్దతు ఉన్న వర్గాలు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు.

కొంతమంది ట్రాకింగ్ ప్రయత్నాలు ఇరాన్‌కు చెందిన మొబైల్ ఆపరేటర్‌తో సంబంధం ఉన్నట్లు డేటా విశ్లేషణలో తేలిందని గ్యారీ మిల్లర్ తెలిపారు.

ఇది సాధారణ పర్యవేక్షణ కాదని, నిర్దిష్ట వ్యక్తుల మొబైల్ పరికరాలనే లక్ష్యంగా చేసుకున్న చర్యగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా సిబ్బందికి ఇది అదనపు భద్రతా సవాల్‌గా మారే అవకాశం

యుద్ధ సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూపులు ఇరాక్, బహ్రెయిన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని మరికొన్ని ప్రాంతాల్లోని అమెరికా ప్రయోజనాలపై దాడులు జరిపినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఘటనల్లో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్లు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సైబర్ భద్రతా నిపుణురాలు నికితా షా మాట్లాడుతూ.. ఫోన్ నెట్‌వర్క్ సంకేతాలను ఉపయోగించి లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం ఇరాన్ సైబర్ యుద్ధ నైపుణ్యం మరింత అభివృద్ధి చెందిందని సూచిస్తోందన్నారు.

ముఖ్యంగా క్షిపణుల పరిధిలో ఉన్న అమెరికా సిబ్బందికి ఇది అదనపు భద్రతా సవాల్‌గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇక అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

జాతీయ భద్రతకు ముప్పు

స్మార్ట్‌ఫోన్లకు కేటాయించే అడ్వర్టైజింగ్ ఐడీలు, వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న లొకేషన్ డేటా దుర్వినియోగం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని హెచ్చరిస్తున్నారు.

విదేశీ ప్రత్యర్థులు అమెరికా సిబ్బంది కదలికలను గుర్తించే అవకాశం పెరుగుతోందని వారు పేర్కొన్నారు.

డెమోక్రాటిక్ సెనేటర్ రాన్ వైడెన్ మాట్లాడుతూ.. అమెరికా సైనికుల ఫోన్లను విదేశీ ప్రత్యర్థులు ట్రాక్ చేసే ప్రమాదంపై తాను గతంలోనే పలుమార్లు హెచ్చరించినట్లు చెప్పారు.

వివరాలు 

దాడుల్లో డేటా ట్రాకింగ్ కీలక పాత్ర

మరోవైపు రిపబ్లికన్ ఎంపీ ప్యాట్ హారిగన్.. ప్రభుత్వ ఉద్యోగుల డిజిటల్ సమాచారాన్ని టెక్ కంపెనీలు విక్రయించకుండా చట్టం తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ ఆరోపణలపై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పందించింది.

ప్రత్యర్థులు వాణిజ్య లొకేషన్ డేటాను ఉపయోగించే అవకాశం ఉందన్న హెచ్చరికలు తమకు అందాయని, అందుకు అనుగుణంగా సైనికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపింది.

అయితే దాడుల్లో డేటా ట్రాకింగ్ కీలక పాత్ర పోషించిందన్న వాదనలకు తగిన ఆధారాలు లేవని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

ADVERTISEMENT