El Mencho: గర్ల్ ఫ్రెండ్ వల్లే చిక్కిన మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో!
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలో అత్యంత ప్రమాదకర మాదక ద్రవ్య మాఫియా నాయకుడిగా పేరుగాంచిన జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) ప్రధానుడు నెమెసియో ఒసెగెరా సెర్వాంటెస్,అలియాస్ 'ఎల్ మెంచో', ఎన్‌కౌంటర్ అనంతరం మృతి చెందాడు. అతని ప్రియురాలి కదలికలను గమనిస్తూ వచ్చిన మెక్సికో సైన్యం,అమెరికా నిఘా సంస్థల సహకారంతో జలిస్కో రాష్ట్రంలోని తపల్పా ప్రాంతంలో భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. మెక్సికో రక్షణ శాఖ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా ట్రెజో వెల్లడించిన వివరాల ప్రకారం,ఎల్ మెంచో ప్రియురాలికి అత్యంత సన్నిహితంగా ఉండే మహిళను అధికారులు ముందుగా గుర్తించారు. ఆమెను రహస్యంగా అనుసరిస్తూ నిఘా కొనసాగించారు. ఫిబ్రవరి 20న ఆ మహిళ, ఎల్ మెంచో ప్రియురాలిని తపల్పాలోని ఓ దూర ప్రాంత గ్రామానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
వివరాలు
కాల్పులలో దెబ్బతిన్న సైనిక హెలికాప్టర్
మరుసటి రోజు ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో, ఎల్ మెంచో ఆ ప్రదేశంలోనే ఉన్నాడని స్పెషల్ ఫోర్సెస్ ధృవీకరించాయి. అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడి నిర్వహించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించగానే, ఎల్ మెంచోకు చెందిన గన్‌మెన్లు తీవ్రంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పులలో ఒక సైనిక హెలికాప్టర్ దెబ్బతిని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎదురుకాల్పుల మధ్య ఎల్ మెంచో సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. గాయపడిన స్థితిలో అతడిని అదుపులోకి తీసుకున్న సైన్యం, చికిత్స కోసం మెక్సికో సిటీకి హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో అతడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రతీకార దాడుల్లో 70 మందికి పైగా మృతి
ఎల్ మెంచో మరణ వార్త బయటకు రావడంతో, అతని కార్టెల్‌కు చెందిన సభ్యులు దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాల్లో ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. జలిస్కో, గ్వానాజువాటో రాష్ట్రాల్లో వాహనాలకు నిప్పంటించడం, భద్రతా సిబ్బందిపై దాడులు జరపడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 25 మంది నేషనల్ గార్డ్ సిబ్బందితో కలిపి మొత్తం 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన సీఐఏ కీలకమైన గూఢచారి సమాచారాన్ని అందించిందని మెక్సికో అధికారులు ధృవీకరించారు. కాగా, ఎల్ మెంచోను పట్టించడానికై అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.