Reza Pahlavi: ఇరాన్‌లో అధికార మార్పు ఆశలు.. షా వారసుడు రెజా పహ్లవీకి పెరుగుతున్న అడ్డంకులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒక్క అవకాశం దొరికితే చరిత్రను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చని భావించాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందని ఆశపడ్డాడు. దేశంలో నెలకొన్న అశాంతి, మార్పు కోరుకుంటున్న ప్రజల భావోద్వేగాలు తనకు అనుకూలంగా మారతాయని అంచనా వేశాడు. దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన లక్ష్యం నెరవేరుతుందని నమ్మినా.. పరిస్థితులు మాత్రం ఆయన ఊహించిన దిశగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన సమయంలోనే వరుస సవాళ్లు ఎదురుకావడంతో షా కుటుంబ వారసుడు రెజా పహ్లవీ రాజకీయ ప్రయాణం సంక్లిష్టంగా మారుతోంది.
వివరాలు
ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితానికే పరిమితం
ఇరాన్‌లో పాలనా మార్పు జరిగితే దేశానికి కొత్త నాయకత్వం ఎవరు వహిస్తారనే చర్చ మొదలైన వేళ.. మాజీ షా మహ్మద్ రెజా పహ్లవీ కుమారుడు రెజా పహ్లవీ తనను ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
1979 ఇస్లామిక్ విప్లవంలో తన తండ్రి పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచి వెళ్లిన ఆయన దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితానికే పరిమితమయ్యారు.
రాజరిక వ్యవస్థ ముగిసినా.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు మాత్రం ఇరాన్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది.
ఇటీవలి కాలంలో ఇరాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు,అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో రాజకీయ మార్పు సంభవించే అవకాశం ఉందనే అంచనాలతో రెజా పహ్లవీ మళ్లీ చురుకుగా వ్యవహరించడం ప్రారంభించారు.
వివరాలు
'నేను గమ్యం కాదు.. గమ్యానికి చేర్చే వంతెన'
కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు.
తాను శాశ్వత పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు దారి చూపే వ్యక్తినేనని రెజా పహ్లవీ స్పష్టం చేశారు.
''నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే'' అంటూ తన పాత్రను వివరించారు.
ఇరాన్ ప్రజలే తమ భవిష్యత్తును ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయించుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటిస్తూ రాజకీయ, సామాజిక మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
అమెరికాలో నివసిస్తున్న కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు ఆయనకు ఆర్థిక సహకారం కూడా అందించారు.
అయినప్పటికీ ఆ మద్దతు ఇరాన్‌లో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా అనే ప్రశ్నలు అప్పటినుంచే వినిపించాయి.
వివరాలు
ప్రభుత్వం కంటే ప్రతిపక్ష విభేదాలే పెద్ద సమస్య
రెజా పహ్లవీ ముందున్న అతిపెద్ద సవాలు కేవలం ఇరాన్ ప్రభుత్వం మాత్రమే కాదు. ప్రతిపక్ష శిబిరంలోని విభేదాలు కూడా ఆయనకు గట్టి అడ్డంకిగా మారాయి.
ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుండగా.. మరోవైపు ప్రతిపక్ష వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.
అంతర్జాతీయ మద్దతు విషయంలోనూ స్పష్టత లేకపోవడం ఆయన రాజకీయ ప్రయాణాన్ని మరింత కఠినంగా మార్చింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. రెజా పహ్లవీకి మద్దతుగా ఉన్న కొందరు వ్యక్తులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు కొందరిపై దాడులకు కూడా పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతకు దెబ్బతీశాయి.
2023లో ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ.. అవి ఎక్కువ కాలం నిలవలేదని సమాచారం.
వివరాలు
దాతల్లోనూ పెరుగుతున్న అసంతృప్తి
రెజా పహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చారు.
అయినప్పటికీ ఆశించిన రాజకీయ పురోగతి కనిపించకపోవడంతో కొంతమంది దాతల్లో అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది.
ఉద్యమాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం, విభిన్న ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని వారు సూచించినట్లు సమాచారం.
వివరాలు
అమెరికా వైఖరిపైనా కొనసాగుతున్న సందేహాలు
ఇరాన్‌లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న రెజా పహ్లవీకి అమెరికా నుంచి పూర్తి స్థాయి రాజకీయ మద్దతు లభించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అమెరికా అధికార వర్గాలు కూడా ఆయనను భవిష్యత్ ఇరాన్ నాయకుడిగా అధికారికంగా గుర్తించలేదు.
ఇరాన్‌లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయంగా నిలదొక్కుకునే సామర్థ్యంపై అమెరికాకు సందేహాలు ఉన్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
వివరాలు
షా వారసత్వం.. బలమా? బలహీనతా?
రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ వారసత్వమే. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను దేశానికి స్థిరత్వం తీసుకురాగల నాయకుడిగా భావిస్తున్నారు.
అయితే అదే గతం ఆయనకు ప్రతికూలంగా మారుతోంది. షా పాలనలో జరిగిన అణచివేతలను గుర్తు చేస్తూ పలు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ప్రస్తుతం ఇరాన్‌లో మార్పు కోరుతున్న నాయకుల్లో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తిగా రెజా పహ్లవీ నిలిచినా.. ఆయన ముందున్న అసలు సవాలు మాత్రం మారలేదు.
విభిన్న ప్రతిపక్ష శక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఇరాన్ ప్రజలకు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించగలరా? అన్న ప్రశ్నకే ఆయన రాజకీయ భవిష్యత్తు సమాధానం చెప్పనుంది.