Iran War Fallout: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ఇటలీలో మొజారెల్లా చీజ్ కొరత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెరిగిన డీజిల్ ధరలు ఇటలీలో బఫెలో మొజారెల్లా చీజ్ కొరతకు కారణమయ్యాయి. ఇంధన ధరలు భారీగా పెరగడంతో ట్రక్కు డ్రైవర్లు వారం రోజులుగా నిరసనలు చేపట్టారు. దీంతో దక్షిణ ఇటలీలోని డెయిరీలకు పాలు సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడటంతో చీజ్ ఉత్పత్తి దాదాపు ఆగిపోయింది. కేవలం 24 గంటల్లోనే సుమారు 30 లక్షల యూరోల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
వివరాలు
రవాణా నిలిచిపోవడంతో మొజారెల్లా ఉత్పత్తికి బ్రేక్
ఇటలీలోని కాంపానియా ప్రాంతంలో బఫెలో మొజారెల్లా ఉత్పత్తిపై ఈ నిరసనల ప్రభావం ఎక్కువగా పడింది.
ఈ చీజ్ తయారీకి గేదె పాలను సేకరించిన వెంటనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.
ఉత్పత్తి నిబంధనల ప్రకారం పాలను 60 గంటల్లోపు చీజ్‌గా మార్చాలి. ఎక్కువసేపు నిల్వ చేయడానికి వీలులేకపోవడంతో రవాణా నిలిచిపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది.
బుధవారం ఉత్పత్తి చేసిన సుమారు 10 లక్షల లీటర్ల గేదె పాలను చీజ్‌గా మార్చలేకపోయినట్లు మొజారెల్లా ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ పియర్ మారియా సక్కానీ తెలిపారు.
కొన్ని డెయిరీలు మూతపడగా, మరికొంతమంది రైతులు వినియోగించలేని పాలను పశువులకు ఆహారంగా ఇస్తున్నారు.
వివరాలు
పెరిగిన ఉత్పత్తి ఖర్చులు.. ఎగుమతులపైనా ప్రభావం
మరోవైపు పశువుల దాణా, డీజిల్, విద్యుత్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడంతో చీజ్ తయారీ వ్యయం సుమారు 30 శాతం పెరిగింది.
ఈ అదనపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపై వేయలేకపోవడంతో ఉత్పత్తిదారుల లాభాలు తగ్గుతున్నాయి.
2025లో ఇటలీ సుమారు 58 వేల టన్నుల మొజారెల్లా డి బుఫాలా కాంపానా చీజ్‌ను ఉత్పత్తి చేసింది.
ఇందులో దాదాపు 37 శాతం విదేశాలకు ఎగుమతి చేశారు. ఫ్రాన్స్ ఈ చీజ్‌కు అతిపెద్ద విదేశీ మార్కెట్ కాగా, బ్రిటన్ కూడా ప్రధాన కొనుగోలుదారుగా ఉంది.
వివరాలు
రవాణా నిలిచిపోవడంతో ఆహార సరఫరాకు అంతరాయం
ట్రక్కుల సమ్మె ప్రభావం చీజ్ పరిశ్రమకే పరిమితం కాలేదు.
దక్షిణ ఇటలీలోని కాంపానియా, పుగ్లియా, కాలాబ్రియా ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు వంటి పాడైపోయే ఆహార పదార్థాలు గోదాముల్లోనే నిలిచిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరత ఏర్పడింది. సరఫరా సమస్యలతో దక్షిణ ఇటలీలోని పది కంపెనీల్లో నాలుగు సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వ్యాపార సంఘం తెలిపింది.
కొన్ని రెస్టారెంట్లు కూడా మూతపడినట్లు సమాచారం. ఇటలీలో 92 శాతం సరుకులు రోడ్డు మార్గంలోనే రవాణా అవుతుండటంతో ఈ అంతరాయం తీవ్ర ప్రభావం చూపుతోంది.
వివరాలు
ట్రక్కు డ్రైవర్లకు, రైతులకు ఇటలీ ప్రభుత్వం ఆర్థిక సాయం
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది.
ట్రక్కు డ్రైవర్లు, రైతులకు అందించే పన్ను రాయితీల మొత్తం విలువను 434 మిలియన్ యూరోల నుంచి 540 మిలియన్ యూరోలకు పెంచింది.
రహదారి దిగ్బంధనాలను దాటే లారీలకు పోలీసు భద్రత కల్పించే చర్యలు చేపట్టింది.
సిసిలీ, కాలాబ్రియా ప్రాంతాల్లో నిరసనలు కొంతవరకు తగ్గినప్పటికీ, ఇంధన సరఫరా, ఆహార రవాణా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడంపై ఇంకా స్పష్టత లేదు.