Sea Mines: హర్మూజ్ జలసంధిలో 'గుండు'సూది కోసం అమెరికా వేట..!
ఈ వార్తాకథనం ఏంటి
విశాలమైన సముద్రంలో ఒక పెద్ద జలాంతర్గామి మునిగిపోయినా, విమానం కూలిపోయినా వాటి జాడ కనుగొనడానికి వారాలు, కొన్నిసార్లు ఏళ్ల సమయం పడుతుంది. మలేసియా విమానం ఇప్పటికీ కనబడకపోవడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. అలాంటి పరిస్థితుల్లో నీటి అడుగున అమర్చిన చిన్న పరిమాణం గల సీమైన్స్‌ను గుర్తించడం అంటే సముద్రంలో గుండుసూదిని వెతికినట్టే. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఇరాన్ ఏర్పాటు చేసిన సీమైన్స్‌ను తొలగించి హర్మూజ్ జలసంధిని శుభ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నప్పటికీ, ఇది అంత సులువైన పని కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైన్స్ ఎక్కడ అమర్చారో స్పష్టత ఇవ్వకుండా ఇరాన్ అనిశ్చితి సృష్టించడంతో అమెరికాకు ఇది క్లిష్టంగా మారింది.
వివరాలు
మైన్స్ గుర్తింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీమైన్స్‌ను తొలగించేందుకు అమెరికా నౌకాదళం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు గైడెడ్ క్షిపణి యుద్ధనౌకలను రంగంలోకి దింపింది. ఇవి నేరుగా మైన్స్ ప్రాంతానికి వెళ్లకుండా,ముందుగా మానవరహిత నీటి అడుగు పరికరాలను వినియోగిస్తోంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ పరికరాలు సముద్రంలో వేగంగా సంచరిస్తూ ఆధునిక శబ్ద తరంగ సాంకేతికంతో పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. ఇవే కాకుండా గగనతలం నుంచి పర్యవేక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ఇవి సముద్ర ఉపరితలం,కొద్దిగా లోతులో ఉన్న మైన్స్‌ను వేగంగా గుర్తించగలవు. మైన్స్ గుర్తించిన వెంటనే చిన్న రోబోటిక్ పరికరాలను పంపించి వాటిని పేల్చివేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మైన్స్‌ను నిర్వీర్యం చేస్తారు.
వివరాలు
మైన్ తొలగింపు అంత సులువు కాదు
అలాగే యుద్ధనౌకలు సముద్రంపై ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి క్షిపణులతో ఎదురుదాడి చేయగలవు. సముద్ర మైన్స్‌ను తొలగించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. మైన్స్ అనేక రకాలుగా ఉంటాయి. నౌకల కదలికల వల్ల ఏర్పడే పీడనం,తరంగాల శబ్దం,విద్యుత్ ప్రభావం వంటి అంశాలపై ఆధారపడి పనిచేసే మైన్స్ కూడా ఉంటాయి. వీటిలో కొన్నింటిని ఆధునిక పరికరాలతో గుర్తించడం కూడా కష్టమవుతుంది. గుర్తించినా వాటిని పేల్చడం సవాలుగా మారుతుంది. అందువల్ల ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న సామర్థ్యం సరిపోదని అంచనా వేస్తున్నారు. గతంలో ఉపయోగించిన ప్రత్యేక మైన్ తొలగింపు నౌకలను అమెరికా పక్కన పెట్టడంతో, ప్రస్తుతం తీర ప్రాంత యుద్ధనౌకలపై ఆధారపడుతోంది.
వివరాలు
ఇరాన్ చుట్టూ యుద్ధ వాతావరణం
అయితే అవి ఎక్కడ మోహరించబడ్డాయన్నది గోప్యంగా ఉంచబడింది. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో మిత్రదేశాల సహాయం అవసరం కావచ్చని భావిస్తున్నారు. శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్ తీర ప్రాంతాలు, ఓడరేవుల చుట్టూ అమెరికా నౌకాదళం భారీగా మోహరించింది. 15కు పైగా యుద్ధనౌకలు అక్కడ కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి. వీటిలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉండే నౌకలు కూడా ఉన్నాయి. ఇవి హర్మూజ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నాయని అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.