LOADING...
Hurricane Melissa: 'మెలిసా' భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం.. పలువురి దుర్మరణం ! 
Melissa: 'మెలిసా' భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం.. పలువురి దుర్మరణం !

Hurricane Melissa: 'మెలిసా' భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం.. పలువురి దుర్మరణం ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అట్లాంటిక్‌ మహాసముద్రంలో రూపుదాల్చిన అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటైన 'మెలిసా' మంగళవారం జమైకాపై విరుచుకుపడి తీవ్ర విపత్తును సృష్టించింది. జమైకా నైరుతి ప్రాంతంలోని 'న్యూ హోప్' వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో దేశాన్ని దెబ్బతీసింది. పెను గాలుల ప్రభావంతో వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి, కొండచరియలు జారిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో దేశంలోని సగభాగంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి, చీకటిలో మునిగిపోయింది. రాజధాని కింగ్‌స్టన్‌ నగరంలోని వీధులు పాడుబడ్డ పట్టణాల్లా నిర్మానుష్యంగా మారాయి.

వివరాలు 

సముద్ర తీరంలో 13 అడుగుల ఎత్తున అలలు

174 ఏళ్ల తుపాన్ల రికార్డులో ఇంతటి భీకర తుపాను జమైకాను ఇంతవరకు తాకలేదు. కేటగిరీ-5 తీవ్రతతో వచ్చిన మెలిసా తుపానుతో పలు ప్రాణనష్టాలు సంభవించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దేశం చరిత్రలో ఎన్నడూ లేని ఆస్తి నష్టం సంభవించబోతోందని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. "తుపాను తీరాన్ని కాస్తముందే తాకింది, నష్ట తీవ్రతను ఇప్పుడే అంచనా వేయడం కష్టమని" ఆయన తెలిపారు. సముద్ర తీరంలో 13 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహాయక చర్యలు వేగవంతం చేయబడ్డాయి. తాత్కాలిక ఆశ్రయాల్ని ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు.

వివరాలు 

తాగునీటిని జాగ్రత్తగా వినియోగించాలి.. ప్రతి చుక్కా విలువైనదిగా భావించాలి 

తుపాను ప్రభావంతో హైతీలో ముగ్గురు, డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి విభాగాలు,పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మందులు, అవసరమైన సరఫరాలు జమైకాకు పంపుతున్నాయి. తాగునీటిని జాగ్రత్తగా వినియోగించాలని, ప్రతి చుక్కా విలువైనదిగా భావించాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. విమానాశ్రయాలు, ప్రజారవాణా సేవలు పూర్తిగా స్తంభించాయి. కింగ్‌స్టన్‌, సెయింట్‌ ఎలిజబెత్‌, క్లారెండన్‌ నగరాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్‌ రిపబ్లిక్‌, బహమాస్‌ దేశాలపై కూడా పడింది.

వివరాలు 

 6 లక్షల మందికి పైగా ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలింపు 

క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికి పైగా ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో తుపానుకు సంబంధించిన కృత్రిమ మేధ (AI)తో రూపొందించిన నకిలీ చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి చూసి ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయం పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని వారు హెచ్చరించారు. ప్రస్తుతం జమైకాలో 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. తుపాను తూర్పు క్యూబా, బహమాస్ దిశగా కదులుతూ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అమెరికా హరికేన్‌ విభాగం అంచనా వేసింది.