South Korea: ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కీలక ప్రకటన
'ఎమర్జెన్సీ మార్షల్ లా' ప్రకటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు. ప్రతిపక్షాల విపరీత వ్యతిరేకత, ప్రజల్లో ఆగ్రహం మధ్య, యూన్ పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంపై ఓటింగ్ త్వరలో జరగనుంది. తన చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో, యూన్ టెలివిజన్ ద్వారా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ తెలిపారు. మార్షల్ లా కారణంగా ప్రజలకు జరిగిన అసౌకర్యం గురించి తాను బాధపడుతున్నానని, ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
సొంత పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత
యూన్ సుక్ యోల్ ఇటీవల ప్రతిపక్షాలపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు కారణంగా అత్యవసర స్థితి విధించారు. ఈ నిర్ణయం తీవ్ర ప్రతిఘటనకు గురవడంతో, పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమై ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. 190-0 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందడంతో, యూన్ వెనక్కి తగ్గి మార్షల్ లాను రద్దు చేశారు. యూన్ చర్యలతో విపక్షాలతో పాటు ఆయన సొంత పార్టీ సభ్యులలో కూడా ఆగ్రహం చెలరేగింది. దీంతో విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. 300 మంది సభ్యులున్న దక్షిణ కొరియా పార్లమెంట్‌లో, 200 మంది యూన్‌కు అనుకూలంగా ఓటు వేస్తేనే ఆయన పదవిలో కొనసాగగలరు.
పదవిని కోల్పోయే ప్రమాదం
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీతో పాటు ఇతర చిన్న విపక్షాలకు కలిపి 192 మంది సభ్యుల మద్దతు ఉంది. అభిశంసన తీర్మానంపై శనివారం సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రస్తుతం పరిస్థితులు యూన్ సుక్కు అనుకూలంగా లేనందున, ఆయన పదవి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు దక్షిణ కొరియా రాజకీయ వాతావరణాన్ని అనిశ్చితిలోకి నెట్టాయి.