ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు?
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుతిన్ నిజంగా అరెస్టు అవుతారా? ఒకవేళ అరెస్టు అయితే ఎవరు అరెస్టు చేస్తారు? ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో చట్టవిరుద్ధంగా పిల్లలను, ప్రజలను ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యన్‌కు తరలించారనే ఆరోపణలతో పుతిన్ అరెస్టుకు ఐసీసీ వారెంట్ జారీ చేసింది. ఐసీసీలో 123 సభ్య దేశాలు ఉన్నాయి. సభ్య దేశాల్లో రష్యా లేకపోవడం గమనార్హం. అందువల్ల ఐసీసీకి రష్యాను విచారించే అధికారాలు లేవు. సభ్యదేశాల్లో మాత్రమే ఐసీసీ నిబంధనలు వర్తిస్తాయి. అందుకే ఐసీసీ అరెస్టు వారెంట్‌ను రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ టాయిలెట్ పేపర్‌తో పోల్చారు.
సభ్యదేశాల్లో అడుగుపెడితే అరెస్టు చేయొచ్చు
అయితే ఐసీసీ పరిధిలోని 123 సభ్య దేశాల భూభాగంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెడితే అప్పుడు అతన్ని అరెస్టు చేసి విచారణకు పంపే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నంతకాలం అతనిని అరెస్టు చేయడం దాదాపు సాధ్యం కాకపోవచ్చని లీగల్ నిపుణుడు జాషువా రోజెన్‌బర్గ్ పేర్కొన్నారు. అతను అరెస్టు అయితే తప్పా, ఈ వారెంట్ నిలబడదన్నారు. ఐసీసీకి సొంతంగా పోలీసు బలగం లేదు కాబట్టి.. ఈ విషయంలో దానికి సహకరించే దేశాల నిబద్ధతపై పుతిన్ అరెస్టు ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల అరెస్టు వారెంట్ విషయంలో స్వల్పకాలంలో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అంటే ఏమిటి?
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. ఇది అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులను విచారిస్తుంది. 1998 జూలై 17న ఇటలీలోని రోమ్‌లో జరిగిన దౌత్య సదస్సులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేయాలని ఒప్పందం జరిగింది. 2002 జులై 1న కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 123 దేశాలు కోర్టులో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఇందులో భారత్, రష్యా, చైనా, అమెరికా, ఇండోనేషియాతో పాటు పలు దేశాలు సభ్య దేశాలుగా లేకపోవడం గమనార్హం. మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, దురాక్రమణ కేసులను ఐసీసీ విచారిస్తుంది.