Page Loader
వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా?
వచ్చే వారం రష్యాకు వెళ్లనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా?

వ్రాసిన వారు Stalin
Mar 13, 2023
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తామని చైనా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు జిన్‌పింగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. డిసెంబరు 30న ఇరువురి నాయకుల మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణలో ఏప్రిల్ లేదా మేలో మాస్కోను సందర్శించాలని జిన్‌పింగ్‌ను పుతిన్ కోరారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంధి కుదుర్చే పనిలో భాగంగానే అనుకున్న దానికంటే ముందుగానే జిన్‌పింగ్ మాస్కోకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రష్యా

జిన్‌పింగ్ పర్యటనపై స్పందించని రష్యా

గత వారమే చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్.. మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటనపై రష్యా ప్రతినిధులు మాట్లాడటానికి నిరాకరించారు. పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజింగ్‌తో సమన్వయం చేసుకొని తగిన సమయంలో పర్యటన వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు. రష్యాతో చైనాకు ఆర్థికంగా, రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, మధ్యవర్తిగా ఉంటామని ప్రకటించిన చైనా.. రష్యాకు సంపూర్ణ మద్దతు పలకాలని చూస్తోందని వాషింగ్టన్ గత నెలలో హెచ్చరించింది. అయితే చైనా ఆ వాదనలను తిరస్కరించింది. తప్పుడు ప్రచారాలను ఆపాలని ఆమెరికాపై ఘాటు స్పందించింది.