US Government Shutdown: అమెరికా షట్‌డౌన్ ప్రభావం.. రూ.62వేల కోట్లు ఆవిరి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లులపై అధికార-విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే 31 రోజులుగా ప్రభుత్వం మూసివేత కొనసాగుతుండటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడింది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ తాజా అంచనాలు విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, షట్‌డౌన్ కారణంగా అమెరికా సంపదలో 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.62,149 కోట్లు) శాశ్వతంగా ఆవిరయ్యాయి. 'ఇదే పరిస్థితి కొనసాగితే, ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల వరకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని బడ్జెట్ ఆఫీస్ పేర్కొంది.
Details
బలహీనంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ
కేపీఎంజీ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ ఈ షట్‌డౌన్ ప్రారంభంలో చిన్న ప్రభావంలా కనిపించినా, ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ ఇవ్వొచ్చని హెచ్చరించారు. ఇదే అంశంపై మూడీస్ అనలిటిక్స్ చీఫ్ మార్క్ జాండీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థికవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంది. ఇలాంటి రాజకీయ సంక్షోభాలు దీన్ని మరింత కుదేలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1981 నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం 15 సార్లు షట్‌డౌన్‌కు గురైంది. 2018-19లో ట్రంప్ అధ్యక్షతన జరిగిన 35 రోజుల షట్‌డౌన్ దేశ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఆ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Details
ఉద్యోగావకాశాలు తగ్గుముఖం
ఇప్పటికే ఉద్యోగ మార్కెట్‌పై షట్‌డౌన్ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. అనేక సంస్థలు ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా పెట్టుబడులు నిలిపివేశాయి. మరికొన్ని కృత్రిమ మేధ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలను ప్రాధాన్యం ఇస్తుండటంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం షట్‌డౌన్ తక్షణ ప్రభావం తక్కువగా ఉన్నా, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి మందగించడం ఖాయం. మార్కెట్ వ్యవస్థలో అంతరాయం కలుగుతుంది. ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి వారం సుమారు 0.1 నుంచి 0.2 శాతం వరకు ఆర్థిక వృద్ధి తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు.