Imran Khan: 'నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు': ఇమ్రాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, జైలు అధికారులు తన భార్య బుష్రా బీబీపై వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఒత్తిడికి గురిచేయడానికి భార్యను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలను ఈద్ సందర్భంగా తన కుమారుడు ఖాసింకు వివరించినట్లు సమాచారం.
వివరాలు
'న్యాయమూర్తులు సిగ్గుపడాలి'.. ఇమ్రాన్ తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'దేశంలోని న్యాయమూర్తులు సిగ్గుపడాలి. మేము ఎన్నిసార్లు న్యాయవ్యవస్థను ఆశ్రయించినా, మాకు న్యాయం జరగడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు అన్యాయం చేస్తున్నారు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. తను లొంగనని వారికి తెలుసు. అందుకే అధికారులు నా భార్యను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బుష్రా బీబీ చికిత్స విషయంలో అమానుషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వివరాలు
భార్యకు ఐసోలేషన్.. మాట్లాడేందుకు కూడా ఆంక్షలు
జైలులో బుష్రా బీబీని పూర్తిగా ఒంటరిగా ఉంచారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆమెతో మాట్లాడేందుకు వారానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నారని, అది కూడా చాలాసార్లు నిరాకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జైలు జీవితం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన కుడి కంటిచూపు సుమారు 85 శాతం వరకు కోల్పోయినట్లు సమాచారం. ఇటీవల ఆయనకు చికిత్స అందినట్లు తెలుస్తోంది.
వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాల లేఖ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తమైంది. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది ప్రముఖ క్రికెటర్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని, కనీస మానవతా దృక్పథంతో గౌరవంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.