Imran khan: అధికార దాహంతో మునీర్ ఎంతకైనా తెగిస్తారు: ఇమ్రాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ చరిత్రలో అత్యంత క్రూరమైన నియంతగా మునీర్ పేరుపొందుతున్నారని, ఆయన మానసిక స్థితి కూడా స్థిరంగా లేదని ఇమ్రాన్ ఆరోపించారు. 2023 ఆగస్టు నుండి అదియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, 'ఎక్స్' ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తరించిందని, అధికారం కోసం ఏమాత్రం వెనుకాడని వ్యక్తి అని ఆయన ఆక్షేపించారు. మే 9 ఘటనలు,నవంబర్ 26 మురిడ్కే సంఘటనలను ఉదహరిస్తూ,అవి అధికార దుర్వినియోగానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణలు అని ఇమ్రాన్ విమర్శించారు.
వివరాలు
తన భార్యను ఏకాంత నిర్బంధంలో ఉంచి వేధిస్తున్నారని ఆవేదన
తన పార్టీ పీటీఐ కార్యకర్తలను పోలీసులు, భద్రతా దళాలు దారుణంగా హత్య చేశాయని పేర్కొన్నారు. "నిరాయుధ పౌరులపై విచక్షణారహిత కాల్పులు జరగడం ఏ శాంతి సమాజంలోనైనా అస్వీకారమే. మహిళలపై జరిగిన అఘాయిత్యాలు ఇంతకు ముందు చూడలేదు," అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసీమ్ మునీర్ తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి వేధిస్తున్నారని కూడా ఇమ్రాన్ ఆరోపించారు. "బానిసత్వంలో జీవించాల్సి వస్తే మరణమే మేలు. నాపై, నా భార్యపై మునీర్ చూపిస్తున్న అమానుషత్వం ఏ రాజకీయ నాయకుడి కుటుంబం ఎదుర్కోలేదు. ఆయన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నేను తలవంచేది లేదు, లొంగేది లేదు," అని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
షెహబాజ్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరణ
ప్రస్తుతం అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం లేదా సైనిక నాయకత్వంతో తన పార్టీ ఎలాంటి చర్చలు జరపబోదని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. "తానే నిర్ణయం తీసుకోలేని, సమాధానం ఇవ్వడానికి ముందే అనుమతి తీసుకోవాల్సిన ప్రధానితో మాట్లాడటం అనవసరం. గతంలో చర్చలకు ప్రయత్నించిన ప్రతిసారీ అణచివేత మరింత పెరిగింది. కాబట్టి చర్చలకేం అర్థం ఉందీ?" అని ఆయన ప్రశ్నించారు.