Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు.. తొమ్మిది నెలల తర్వాత భార్య భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని,పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీ అదియాలా జైలులో కలిశారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత కుటుంబ సభ్యులతో ఇమ్రాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఇమ్రాన్ పార్టీ పీటీఐ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, జైలు అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్ ఆరోగ్యం, ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలపై దృష్టి సారించింది.
వివరాలు
సుప్రీం ఆదేశాలతో జైలులో కుటుంబ సభ్యుల భేటీ
ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను క్రమం తప్పకుండా కలిసేందుకు అవకాశం కల్పించాలని,తన కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలని జైలు అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
వారానికి ఒకసారి కుటుంబ సభ్యులతో భేటీకి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జైలులో కుటుంబ సభ్యుల భేటీ జరిగింది.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. నూరీన్ నియాజీ సుమారు 15 నిమిషాల పాటు ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు.
సుప్రీంకోర్టు షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఆయనకు వివరించారు.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన బుష్రా బీబీ
అదే సమయంలో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ఆ తర్వాత బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను సుమారు 30 నుంచి 35 నిమిషాల పాటు కలిశారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత భార్యతో ఇమ్రాన్ భేటీ కావడం గమనార్హం.
అధిక భద్రత ఉన్న రావల్పిండి జైలు నుంచి తనను ఆస్పత్రికి తరలించాలని,తనకు నచ్చిన వ్యక్తిగత వైద్యులను కలిసే అవకాశం కల్పించాలని ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తన ఆరోగ్యం,వైద్య సేవలను పొందే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
వైద్య బృందంలో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.
అక్కడ నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది.
ఈ వైద్య బృందంలో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ కూడా ఉండనున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కంటి సమస్యకు చికిత్స అందించేందుకు ఇమ్రాన్‌ను పలుమార్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జనవరి చివర్లో ఆయన కుడి కంటికి సుమారు 85 శాతం చూపు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ఈ వాదనను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. అనంతరం ఇమ్రాన్ కంటి చూపు సుమారు 70 శాతం మేర తిరిగి వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.
వివరాలు
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన పీటీఐ
ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దీంతో ఇతర రోగులకు ఇబ్బందులు కలగకుండా మద్దతుదారులు వ్యవహరించాలని న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్వాగతించింది. ఇమ్రాన్ ఆరోగ్యం, ఆయనకు తగిన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశంపై చాలాకాలంగా కొనసాగుతున్న ఆందోళనలకు ఈ తీర్పు పరిష్కారం చూపుతుందని పార్టీ పేర్కొంది.
అయితే ఇమ్రాన్ వైద్య చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అజమ్ నజీర్ తరార్ తెలిపారు.