Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలకు తెరా.. సోదరికి జైలులో ఆయనను కలిసేందుకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతిచెందారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన వదంతులకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన జైల్లో పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ స్పష్టం చేశారు. అయితే జైలులో ఇమ్రాన్‌పై మానసిక ఒత్తిడి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున ఉజ్మాతో పాటు ఒక న్యాయవాదికి జైలు అధికారులు ఇమ్రాన్‌ను కలిసే అవకాశం కల్పించారు.
వివరాలు
సోషల్ మీడియాలో నిరాధార వార్తలు
గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో నిరాధార వార్తలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించినప్పటికీ, ఆయన్ను ప్రత్యక్షంగా చూపించాలని, అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలను వెల్లడించాలని అభిమానులు, మద్దతుదారులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా, జైలు అధికారులు మంగళవారం వరకు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల మధ్య చివరకు జైలు అధికారులు ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించారు .