Page Loader
China Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్ 
China Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్

China Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్ 

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్న తీరుపై మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆయన అంగీకరించారు. ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. జిన్‌పింగ్ గత 10 సంవత్సరాలుగా అంటే 2013 నుండి నూతన సంవత్సర పండుగ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇన్నేళ్ల నూతన సంవత్సర సందేశంలో జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ, పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా ఆ దేశం మాంద్యంతో పోరాడుతోంది.

చైనా

దేశ ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు: జిన్‌పింగ్ 

కొన్ని రకాల వ్యాపారాలకు ప్రస్తుత పరిస్థితులు కష్టంగా ఉన్నాయని జిన్‌పింగ్ అంగీకరించారు. దేశ ప్రజలు ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్థిక సంస్కరణల వేగాన్ని వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని జిన్‌పింగ్ అన్నారు. జిన్‌పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. డిసెంబర్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వివరించింది. ఎన్‌బీఎస్ ప్రకారం, నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. డిసెంబర్‌లో చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి.