Trump: 'ఇది నా మూడో అధ్యక్ష పదవీకాలం' అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
తరచూ తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది మూడోసారి అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం రెండోసారి మాత్రమే. అయితే, 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం జో బైడెన్ వల్ల అన్యాయంగా కోల్పోయానని గతంలో అనేకసార్లు ఆరోపించిన ట్రంప్, ఆ ఎన్నికను కూడా తన అధ్యక్ష పదవీకాలంలో భాగంగా పరిగణిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. అనంతరం చిరునవ్వుతో, వివాదాస్పద అంశాలపై మరింతగా మాట్లాడదలచుకోలేదని చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
వివరాలు
షాకింగ్ కామెంట్స్..
అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగడం యాదృచ్ఛికంగా జరగలేదని ట్రంప్ పేర్కొన్నారు. తాను తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశ సైన్యాన్ని బలోపేతం చేసి, ఆధునికీకరించినట్లు వివరించారు. అలాగే అమెరికా రక్షణ సామర్థ్యాలను మరింత పెంచేందుకు తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్, "లెక్క ప్రకారం చూస్తే నేను ఇప్పుడు మూడోసారి అధ్యక్షుడిగా ఉన్నట్టే. అయితే వివాదాలకు తావివ్వాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే ఆ విషయాన్ని నేను మరింతగా ప్రస్తావించను" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి..
కాగా, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవిచూశారు. అయితే, ఆ ఫలితాలను ఆయన ఎప్పటికీ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, పలు కీలక రాష్ట్రాల్లో న్యాయపరమైన పోరాటం కూడా ప్రారంభించారు. అయినప్పటికీ, తన ఆరోపణలకు బలమైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యారు. ఇదిలా ఉండగా, జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ఆ దాడికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణమన్న ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి.