Loading...
Trump: ట్రంప్‌ కొత్త వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యం.. ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా
ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా

Trump: ట్రంప్‌ కొత్త వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యం.. ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు ట్రంప్‌ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో కీలక స్థానం లభించింది. ఆసియా దేశాలపై మరింత దృష్టి కేంద్రీకరిస్తూ విదేశాల్లో సమాచార ప్రసార విధానాన్ని ఆధునికీకరించేందుకు అమెరికా కొత్త కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భారత్‌, జపాన్‌ వంటి కీలక భాగస్వామ్య దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించనున్నట్లు అమెరికా గ్లోబల్‌ మీడియా ఏజెన్సీ(USAGM)డైరెక్టర్‌ పదవికి నామినేట్‌ అయిన సారా రోజర్స్‌ వెల్లడించారు. అమెరికా సెనేట్‌ విదేశాంగ వ్యవహారాల కమిటీ ఎదుట జరిగిన విచారణలో మాట్లాడిన సారా రోజర్స్‌.. ఆసియా ప్రాంతం తమ వ్యూహాత్మక ప్రాధాన్యాల్లో ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. చైనా సహా ఇతర నిరంకుశ దేశాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేందుకు కొత్త తరహా సమాచార వ్యూహం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

డిజిటల్‌ వేదికలకు అధిక ప్రాధాన్యం

వాయిస్‌ ఆఫ్‌ అమెరికా (VOA), రేడియో ఫ్రీ ఆసియా (RFA), రేడియో ఫ్రీ యూరప్‌ (RFE) వంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు అమెరికా గ్లోబల్‌ మీడియా ఏజెన్సీ పరిధిలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు.

భారత్‌, జపాన్‌ వంటి దేశాల్లో సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా ఉండటంతో ఆ దేశాలపై తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు రోజర్స్‌ తెలిపారు.

ఈ దేశాలకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పంచుకున్నానని పేర్కొన్నారు.

సంప్రదాయ రేడియో, టెలివిజన్‌ ప్రసారాలకే పరిమితం కాకుండా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న డిజిటల్‌ వేదికల ద్వారా సమాచారాన్ని చేరవేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

యూఎస్‌ఏజీఎం అధిపతి సారా రోజర్స్‌ వెల్లడి

భవిష్యత్తులో షార్ట్‌ వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, ప్రవాస భారతీయుల గ్రూప్‌ చాట్‌లు వంటి డిజిటల్‌ మాధ్యమాలు సమాచార వ్యాప్తిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని రోజర్స్‌ తెలిపారు.

స్వతంత్ర సమాచారం అందుబాటులో లేని దేశాలపై ప్రత్యేక దృష్టి సారించి విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

చైనాతో వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాలతో పాటు సమాచార రంగంలోనూ పోటీ మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా ఈ కొత్త ప్రజా దౌత్య వ్యూహాన్ని అమలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT