Page Loader
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్

వ్రాసిన వారు Stalin
Jan 27, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్‌బోర్న్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్‌పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు. తాజాగా ఈ దాడులను భారత ఖండించింది. మెల్‌బోర్న్‌లో భారతీయుల భద్రతతో పాటు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియాలోని భారత హైకమిషన్ కోరింది. ఇలాంటి ఘటనలు భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజంలో ద్వేషాన్ని రగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతాల్లో హిందూ మతం ఒకటి. 2021 ఆస్ట్రేలియన్ జనాభా లెక్కల ప్రకారం, హిందూమతం 55.3 శాతం పెరిగి 6,84,002 మందికి చేరుకుంది.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన భారత హైకమిషన్

జనవరి 12న మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లోని హరే కృష్ణ దేవాలయాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జనవరి 16న కారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయం, 23వ తేదీన మెల్‌బోర్న్‌లోని ఉత్తర శివారు మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిర్ గోడలను ఖలిస్థాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. అంతేకాదు మందిరాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలతో రాశారు. కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ కూడా మెల్‌బోర్న్, సిడ్నీలలో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యలను అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. భారత్ తన ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నట్లు భారత హైకమిషన్ పేర్కొంది.