రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. 'సిక్కుస్ ఫర్ జస్టిస్', 'ఖలిస్తానీ జిందాబాద్', 'రెఫరెండం -2020' అని రాసి ఉన్న పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు అంటించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని ఖలిస్తానీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. వారు మిలిటెంట్ ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమాలను అణచివేశాయి. రెండు నెలల క్రితం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఖలిస్థాన్ జెండాలు వెలిశాయి.
ఖలిస్తానీ పోస్టర్ల కలకలంపై కేసులు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
రిపబ్లిక్ డే వేడుకలు ఇంకో ఐదు రోజుల్లో జరగనుండటంతో దిల్లీ పోలీసులతో పాటు కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. పోస్టర్లు ప్రత్యక్ష కావడంపై పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల ఉగ్రవాద నిరోధక విభాగం విచారణ ప్రారంభించింది. మరోవైపు కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం కంటెంజెంట్లు రిహార్సల్స్ నిర్వహిస్తున్నందున ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు కర్తవ్యపథ్ చుట్టూ ఉన్న భవనాల్లో విధ్వంస నిరోధక తనిఖీలు (ఏఎస్‌సీ) నిర్వహిస్తున్నారు. జనవరి 23న పూర్తి డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. దీని కోసం జనవరి 22 సాయంత్రం 6.30 నుంచి జనవరి 23 మధ్యాహ్నం 1 గంటల వరకు కర్తవ్యపథ్ చుట్టూ ఉన్న భవనాలను మూసివేస్తారు.