LOADING...
Israel-Iran: ఖమేనీ బంకర్లపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. వీడియో వైరల్
ఖమేనీ బంకర్లపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. వీడియో వైరల్

Israel-Iran: ఖమేనీ బంకర్లపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు భారీ దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియాను కుదిపేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మాజీ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ కోసం నిర్మించిన భూగర్భ బంకర్లను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొసాద్ సహకారంతో సుమారు 50 ఫైటర్ జెట్‌లు టెహ్రాన్‌లో ఉన్న ఆ భూగర్భ బంకర్లపై దాడులు జరిపాయి. మొసాద్, ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మధ్య సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

Details

బంకర్లపై బాంబుల దాడి

దాడుల్లో బంకర్లపై భారీగా బాంబులు వేయడంతో అవి తీవ్రంగా ధ్వంసమయ్యాయని సమాచారం. ఈ భూగర్భ బంకర్‌ను యుద్ధ పరిస్థితుల్లో తన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఖమేనీ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన మరణం తర్వాత ఈ ప్రదేశాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారులు వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ సైనిక ప్రణాళికలు రూపొందించడానికి, అలాగే పశ్చిమ దేశాలపై దాడులను ప్రోత్సహించడానికి ఈ బంకర్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందడంతో దాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. టెహ్రాన్ నగరంలోని పలు వీధుల కింద విస్తరించి ఉన్న ఈ భూగర్భ నిర్మాణంలో ఇరాన్ ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తులు సమావేశమయ్యే గదులు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.

Details

అగ్నిగుండంలా మారిన పశ్చిమాసియా ప్రాంతం

ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ బంకర్‌పై దాడి చేసి పేల్చివేసినట్లు వెల్లడించింది. గత ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, యూఎస్ సంయుక్తంగా ఇరాన్ అధ్యక్ష భవనంపై దాడి చేసి ఖమేనీని హతమార్చినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ప్రముఖులు కూడా మరణించినట్లు సమాచారం. ఆ తరువాత ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది. ఈ పరిణామాలతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement