Loading...
UN Security Council: గల్ఫ్‌లో భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యం: భారత్
గల్ఫ్‌లో భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యం: భారత్

UN Security Council: గల్ఫ్‌లో భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యం: భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని భారత్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో తీవ్రంగా ఖండించింది. హింసాత్మక ఘటనలు వెంటనే నిలిచిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు దౌత్యపరమైన చర్చలే శాశ్వత పరిష్కారమని మరోసారి స్పష్టం చేసింది.

వివరాలు 

నౌకలపై దాడులు.. ఒకరు మృతి 

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. ఈ నెల హర్మూజ్ జలసంధిలో జీఎఫ్‌ఎస్ గెలాక్సీ, ఎంటీ ఏఐ బహియాహ్, ఎంటీ మొంబాసా వాణిజ్య నౌకలపై దాడులు జరిగినట్లు తెలిపారు.

ఈ ఘటనల్లో పలువురు భారతీయులు గాయపడగా, ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

మరో భారతీయుడు ఇప్పటికీ గల్లంతైనట్లు పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

దాడులు వెంటనే నిలిపివేయాలని భారత్ డిమాండ్

వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు వెంటనే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది.

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని స్పష్టం చేసింది.

సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని హూతీలు కొనసాగిస్తున్న దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి, దక్షిణ ఎర్ర సముద్ర ప్రాంతాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడటం ప్రపంచ దేశాలందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొంది.

అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను పరిరక్షించేందుకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని భారత్ ఐరాస వేదికగా పిలుపునిచ్చింది.

ADVERTISEMENT