భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలని, దాని ప్రస్తుత నిర్మాణం దిక్కుమాలిన విధంగా ఉందని, అది అనైతికమైనదని భారత్ అభిప్రాయపడింది. భద్రతా మండలి ప్రస్తుత నిర్మాణం కొత్త శక్తుల పెరుగుదల, మారుతున్న భౌగోళిక రాజకీయ దృక్కోణాన్ని ప్రతిబింబించదన్నారు, ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భద్రతా మండలి సంస్కరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌కు చెందిన శాశ్వత ప్రతినిధులు మాట్లాడారు. భారత్ తరఫున కాంబోజ్ మాట్లాడారు. యూఎన్ఎస్‌సీ సంస్కరణ ఆవశ్యకతను ఈ సందర్భంగా కాంబోజ్ నొక్కి చెప్పారు.
ప్రస్తుత భద్రతా మండలి అసమర్థమైనది: ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు సమీర్ సరన్
వాతావరణ మార్పు, ఉగ్రవాదం, మహమ్మారి, మానవతా సంక్షోభాలకు సమిష్టి కృషి, భాగస్వామ్యాలు చాలా అవసరం అని కాంబోజ్ అన్నారు. భద్రతా మండలి సంస్కరణకు సమయం ఆసన్నమైందని ఆమె చెప్పారు. భారతదేశపు ప్రముఖ థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) అధ్యక్షుడు సమీర్ సరన్ మాట్లాడుతూ, గత శతాబ్దపు యుద్ధ విజేతల సమూహం నేటి ప్రపంచాన్ని నిర్వహించే బాధ్యతను కలిగి ఉండటం సరికాదన్నారు. ప్రస్తుత భద్రతా మండలి అసమర్థమైనదని సరన్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ సహా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు నిర్మాణాన్ని ఎలా అంగీకరించాలని ప్రశించారు.