PM Modi : ప్రపంచ స్థిరత్వానికి భారత్-ఐరోపా భాగస్వామ్యం కీలకం: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు భారత్-ఐరోపా భాగస్వామ్యం బలమైన ఆధారంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, సరఫరా వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్, ఐరోపా దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ నగరంలో వోల్వో సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యూరోపియన్ ప్రధాన కార్యనిర్వాహకుల చర్చా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. భారత్-ఐరోపా సంబంధాలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
వివరాలు
అభివృద్ధి మరింత వేగం అందుకుంది: మోదీ
దేశంలోని యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, వేగంగా విస్తరిస్తున్న మౌలిక వసతులు భారత ఆర్థికాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందన్నారు. గత పన్నెండేళ్లుగా చేపట్టిన సంస్కరణల ఫలితంగా అభివృద్ధి మరింత వేగం అందుకుందని వివరించారు. తదుపరి సాంకేతిక విప్లవాన్ని భారత్‌లో సంయుక్తంగా నిర్మించాలని ఐరోపా సంస్థలకు ప్రధాని పిలుపునిచ్చారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.