India-Nordic Nations: హరిత సాంకేతిక రంగంలో భారత్-నార్డిక్ దేశాల బంధం మరింత బలోపేతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, నార్డిక్ దేశాల మధ్య హరిత సాంకేతికత, నవకల్పనల రంగాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన భారత్-నార్డిక్ దేశాల మూడో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉత్తర ఐరోపాకు చెందిన నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపి పలు కీలక ఒప్పందాలకు రూపకల్పన చేశారు. పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని అన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి.
వివరాలు
ఈ సదస్సులో పాల్గొన్న స్వీడన్ ప్రధాని
సదస్సుకు ముందు ఐస్‌లాండ్ ప్రధాని క్రిస్‌ట్రౌన్ ఫ్రోస్టడోటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో, డెన్మార్క్ తాత్కాలిక ప్రధాని మెటే ఫ్రెడెరిక్‌సన్‌లతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ సేవల విస్తరణ,వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, కార్బన్ నిల్వ సాంకేతికత, భూగర్భ ఉష్ణశక్తితో విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక అంశాలు కూడా సమావేశంలో ప్రాధాన్యం పొందాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్‌లో తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు,ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మోదీ వెల్లడించారు. ఓస్లోలో నిర్వహించిన నార్వే-భారత్ వాణిజ్య, పరిశోధన సదస్సులో మాట్లాడుతూ నార్వేకు చెందిన సంస్థలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
వివరాలు
రాహుల్‌కు ఇంటర్వ్యూ కోరిన నార్వే పాత్రికేయురాలు
ఐదుదేశాల పర్యటనలో భాగంగా నార్వే పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఇటలీకి బయల్దేరారు. నార్వేలో జరిగిన దేశాధినేతల సమావేశం అనంతరం విలేకరులు ప్రశ్నలు అడిగే అవకాశం ప్రధాని మోదీ కల్పించలేదని స్థానికపాత్రికేయురాలు హెల్లే లింగ్ విమర్శించారు. దీనిపై భారత విదేశీవ్యవహారాల శాఖ స్పందిస్తూ తాము ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నలు అడగవచ్చని ఆమెకు సూచించింది. ఈఅంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేయగా,అనంతరం హెల్లే లింగ్ రాహుల్‌ను ఫోన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇదేసమయంలో భారత్‌లో మాధ్యమ స్వేచ్ఛ, మానవ హక్కుల అంశాలపై విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.బి.జార్జి స్పందించారు. భారతప్రజాస్వామ్య వ్యవస్థ,రాజ్యాంగపరిరక్షణపై పూర్తి అవగాహన లేకుండానే కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.