Loading...
Osama Bin Laden: లాడెన్‌ టార్గెట్‌ లిస్టులో భారత్‌.. సీఐఏ పత్రాల్లో సంచలన విషయాలు!
లాడెన్‌ టార్గెట్‌ లిస్టులో భారత్‌.. సీఐఏ పత్రాల్లో సంచలన విషయాలు!

Osama Bin Laden: లాడెన్‌ టార్గెట్‌ లిస్టులో భారత్‌.. సీఐఏ పత్రాల్లో సంచలన విషయాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్‌ఖైదా ఉగ్ర నేత ఒసామా బిన్‌ లాడెన్‌ (Osama bin Laden) భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని భావించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాల్లో వెల్లడైంది. 9/11 దాడికి 25 ఏళ్లు పూర్తయిన వేళ.. లాడెన్‌కు సంబంధించి అమెరికా (USA) సీఐఏ నుంచి వెళ్లిన 70 ప్రెసిడెన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్స్‌ను బహిర్గతం చేశారు. దాదాపు 100 పేజీలకు పైగా ఉన్న ఈ పత్రాల్లో 9/11 దాడికి ముందు సీఐఏ సమీకరించిన రహస్య సమాచారం, హెచ్చరికలు ఉన్నాయి.

వివరాలు

లాడెన్‌ లక్ష్యాల జాబితాలో భారత్‌ కూడా..

1998 ఆగస్టు 28 నాటి బ్రీఫింగ్‌లో లాడెన్‌ పలు దేశాలపై దాడులకు పథకం పన్నినట్లు సీఐఏ వెల్లడించింది.

ఈ జాబితాలో భారత్‌ పేరు కూడా ఉన్నట్లు పేర్కొంది. మన దేశంతోపాటు ఈజిప్ట్‌, పాకిస్థాన్‌, కువైట్‌, సౌదీ అరేబియా, యెమెన్‌, ఉగాండా, నైజీరియా దేశాల పేర్లను కూడా లాడెన్‌ పరిశీలించినట్లు పత్రాల్లో వెల్లడైంది.

'బిన్‌ లాడెన్‌ టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్‌ స్టిల్‌ ఏ థ్రెట్‌' అనే పేరుతో ఉన్న పత్రంలో ఈ వివరాలను పొందుపరిచారు.

అయితే భారత్‌లో లాడెన్‌ దేనిని లక్ష్యంగా చేసుకున్నాడు? ఇందుకు సంబంధించిన ఆపరేషన్‌ ప్లాన్‌ ఏంటి? అనే విషయాలను మాత్రం ఆ పత్రాల్లో వెల్లడించలేదు.

వివరాలు

పలు ప్రాంతాల్లో బలమైన నెట్‌వర్క్

ఉత్తర అమెరికా, ఐరోపా, తూర్పు ఆసియాలో లాడెన్‌ బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు రహస్య పత్రాల్లో పేర్కొన్నారు.

దీంతో అతడు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే అనుమానాలకు మరింత బలం చేకూరింది.

అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌పై క్షిపణులు ప్రయోగించడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా లాడెన్‌ మరిన్ని దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈ పత్రాల ద్వారా వెల్లడైంది.

ముఖ్యంగా అమెరికా, యూకేలను లక్ష్యంగా చేసుకోవాలని అతడు భావించినట్లు తేలింది.

క్లింటన్‌, జార్జ్‌ బుష్‌లకు సీఐఏ హెచ్చరికలు

బిన్‌ లాడెన్‌ కుట్రలకు సంబంధించి 1998 నుంచి 2001 మధ్యకాలంలో అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌లను సీఐఏ పలుమార్లు హెచ్చరించినట్లు ఈ ప్రెసిడెన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్స్‌లో వెల్లడైంది.

ADVERTISEMENT