Tom Cooper: యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్‌దే ఆధిపత్యం.. ఆస్ట్రియా విశ్లేషకుడు టామ్ వ్యాఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడులపై ఆస్ట్రియా దేశానికి చెందిన వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్ కూపర్ కీలక అభిప్రాయాలు వెల్లడించారు. భారత చర్యలను ఆయన స్పష్టమైన సైనిక విజయంగా పేర్కొన్నారు. భారత్ కేవలం సైనికంగా పాకిస్థాన్‌పై ఆధిక్యం సాధించడమే కాకుండా, ముందస్తు ప్రణాళికతో కచ్చితత్వం కలిగిన ప్రతిస్పందన ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ చర్యల ద్వారా ప్రత్యర్థి దేశానికి గట్టి వ్యూహాత్మక సంకేతం పంపడంలో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
వివరాలు
పాకిస్థాన్ రక్షణాత్మక ధోరణి
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన ప్రతీకార దాడులు జరిపిందని టామ్ కూపర్ చెప్పారు. భారత దళాలు చేరలేవని భావించిన కఠిన లక్ష్యాలను సైతం విజయవంతంగా ఛేదించాయని తెలిపారు. ఈ దాడుల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్ రక్షణాత్మక ధోరణిని అవలంబించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. భారత్ నిర్వహించిన కార్యాచరణ దాని వ్యూహాత్మక విధానంలో కీలక మార్పును సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేసే స్థాయి పాకిస్థాన్‌కు లేదు
పాకిస్థాన్‌లో ఎక్కడైనా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం భారత్‌కు ఉందని, తమను అడ్డుకోవడం సాధ్యం కాదని స్పష్టమైన సందేశాన్ని భారత్ ఇచ్చిందన్నారు. దీనికి ప్రతిగా పాకిస్థాన్ చేపట్టిన చర్యలను భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా ఎదుర్కొని అడ్డుకున్నాయని తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య జరిగే శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం చేసే స్థాయి పాకిస్థాన్‌కు లేదని కూడా టామ్ కూపర్ అభిప్రాయపడ్డారు.