Dutch: భారత్‌లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు.. భారత్ గట్టి కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. దేశ సామాజిక నిర్మాణం, ప్రజాస్వామ్య వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని స్పష్టం చేసింది. ది హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ.. తగిన సమాచారం లేకపోవడం, అవగాహన లోపించడమే ఇలాంటి విమర్శలకు కారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి ముందు డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పత్రికా స్వేచ్ఛతో పాటు మైనారిటీల హక్కులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.
వివరాలు
డచ్ ప్రధాని వ్యాఖ్యలకు స్పందించిన భారత్
ఈ అంశంపై తమ ప్రభుత్వానికి ఆందోళన ఉందని ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి విషయాలను తరచూ భారత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా చెప్పారు. డచ్ ప్రధాని వ్యాఖ్యలకు భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. 140 కోట్ల జనాభాతో, ఐదు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన విశాలమైన వైవిధ్యభరిత దేశం భారత్ అని సిబి జార్జ్ తెలిపారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు భారతదేశంలోనే పుట్టాయని గుర్తుచేశారు. అన్ని మతాలు శతాబ్దాలుగా ఇక్కడ స్వేచ్ఛగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
వివరాలు
భారత్, నెదర్లాండ్స్ రెండూ ప్రజాస్వామ్యం, సుపరిపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఓటర్లు పాల్గొనడం భారత ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని చెప్పారు. స్వాతంత్య్రం సమయంలో దేశంలో మైనారిటీల జనాభా 11 శాతం ఉండగా ప్రస్తుతం అది 20 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించారు. ఇది భారత సమ్మిళిత భావనకు నిదర్శనమని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీతో భేటీ అనంతరం డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ.. భారత్, నెదర్లాండ్స్ రెండూ ప్రజాస్వామ్యం, సుపరిపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశాలని పేర్కొనడం విశేషం.