LOADING...
Rafale Deal: భారత్ రక్షణ రంగంలో భారీ అడుగు.. 114 రాఫెల్ జెట్‌ల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం
భారత్ రక్షణ రంగంలో భారీ అడుగు.. 114 రాఫెల్ జెట్‌ల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం

Rafale Deal: భారత్ రక్షణ రంగంలో భారీ అడుగు.. 114 రాఫెల్ జెట్‌ల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-ఫ్రాన్స్ మధ్య మరో భారీ రక్షణ ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్‌ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ముందడుగు వేస్తోంది. ఈ నెల చివర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆలోపు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌ (DAC) ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన DAC త్వరలో సమావేశం కానుంది. ఇప్పటికే గత నెలలో రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని రక్షణ సేకరణ బోర్డు రాఫెల్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ డీల్ ఖరారైతే, భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

Details

మొత్తం రూ.3.25 లక్షల కోట్లు

దీని మొత్తం విలువ సుమారు రూ. 3.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర స్వ్కాడ్రన్ కొరతను ఎదుర్కొంటోంది. భారత వాయుసేనకు అవసరమైన 42 స్వ్కాడ్రన్లకు గానూ ప్రస్తుతం కేవలం 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ ఒప్పందం వాయుసేన యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, 114 రాఫెల్ విమానాల్లో 18ను ఫ్లై అవే స్టేటస్‌లో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నారు. మొత్తం డీల్‌లో దాదాపు 80 శాతం విమానాల ఉత్పత్తి దేశీయంగానే జరగనుంది.

Details

రాఫెల్ జెట్‌లతో అనుసంధానించవచ్చు

మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్‌వర్క్ కింద స్వదేశీ కంటెంట్ 60శాతానికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 88సింగిల్-సీట్, 26 ట్విన్-సీట్ రాఫెల్ వేరియంట్లను తమ ఫ్లీట్‌లో చేర్చుకోనుంది. స్థానిక తయారీ కోసం డస్సాల్ట్ ఏవియేషన్ ఇప్పటికే భారతీయ ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో అత్యాధునిక రాడార్లు, సెన్సార్లు ఉండటంతో పాటు, దీర్ఘ శ్రేణి దాడి సామర్థ్యం కూడా ఉంది. మెటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులను రాఫెల్ జెట్‌లతో అనుసంధానించవచ్చు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ విమానాల సామర్థ్యం ప్రత్యక్షంగా రుజువైంది. భారత వాయుసేన శక్తిని మరో స్థాయికి తీసుకెళ్లనుందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement