Page Loader
India-Canada: భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి
భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి

India-Canada: భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్ ను కెనడా అనుమానితునిగా పేర్కొనడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణలను భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్‌తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు.

వివరాలు 

జర్మనీ, బ్రిటన్‌లో రష్యా విదేశీ జోక్యానికి పాల్పడింది

''మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు.కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. . ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ, బ్రిటన్‌లో రష్యా విదేశీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం'' అని ఆమె అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ''మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్‌తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్‌లో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా భారత దౌత్యవేత్తలు వియన్నా కన్వెన్షన్‌ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం'' అని ఆమె అన్నారు.

వివరాలు 

ఆరుగురు కెనడా దౌత్యవేత్తల బహిష్కరణ 

నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరు కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.