Loading...
UN: మైనారిటీల హక్కులపై పాక్‌ వ్యాఖ్యలకు ఐరాసలో భారత్‌ కౌంటర్
మైనారిటీల హక్కులపై పాక్‌ వ్యాఖ్యలకు ఐరాసలో భారత్‌ కౌంటర్

UN: మైనారిటీల హక్కులపై పాక్‌ వ్యాఖ్యలకు ఐరాసలో భారత్‌ కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై భారత్‌కు సలహాలు ఇచ్చే పాకిస్థాన్‌ తీరును ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా భారత దౌత్యవేత్త భావిక మంగళానందన్‌ ప్రశ్నించారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను కూడా పాకిస్థాన్‌ స్వీకరించలేదని గుర్తుచేశారు. అలాంటి దేశం మత విశ్వాసాలు, అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అంత్యక్రియల హక్కులపై మత స్వేచ్ఛ, విశ్వాసాలకు సంబంధించిన ఐరాస ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చలో భారత దౌత్యవేత్తలు ఈ అంశాలను ప్రస్తావించారు. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన పలువురు పాకిస్థాన్‌ సైనికులకు భారత సైన్యమే సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని భావిక తెలిపారు.

వివరాలు 

జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల్లో జోక్యం మానుకోవాలని పాక్‌కు సూచన

ఇస్లామిక్‌ సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఈ వాస్తవాలను ప్రత్యేక ప్రతినిధి నివేదికలో ప్రస్తావించకపోవడంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.

జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ జోక్యం చేసుకోవడం మానుకోవాలని భావిక సూచించారు.

పాక్‌ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ దేశం దృష్టి సారించాలని అన్నారు.

పాకిస్థాన్‌లో మైనారిటీల జనాభా తగ్గిపోతోందని, వారి హక్కులు తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నాయని ఆరోపించారు.

సొంత దేశంలోని మైనారిటీలకు రక్షణ కల్పించలేని పాకిస్థాన్‌కు భారత్‌కు సలహాలు ఇచ్చే నైతిక హక్కు లేదని విమర్శించారు.

వివరాలు 

ఉగ్రవాదుల హక్కులతో పాటు బాధితుల హక్కులకూ ప్రాధాన్యం ఇవ్వాలని భారత్‌ డిమాండ్

కరోనా మహమ్మారి సమయంలో చోటుచేసుకున్న వివక్ష, అక్రమాలకు సంబంధించిన అంశాలపైనా భావిక స్పందించారు.

ఈ ఘటనలపై రూపొందించిన ప్రత్యేక ప్రతినిధి నివేదికలో అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావించకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు ఎదుర్కొన్న బాధలను ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు.

ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కుల గురించి ప్రస్తావించిన నివేదికలో ఉగ్రవాద బాధితుల హక్కులకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిక స్పష్టం చేశారు.

అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల హక్కులపై చూపుతున్న శ్రద్ధ, వారి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల హక్కుల విషయంలోనూ కనిపించాలని అన్నారు.

ADVERTISEMENT