Kuwait: కువైట్‌లో జులై 19 వరకు భారత పాస్‌పోర్ట్, వీసా సేవలకు తాత్కాలిక విరామం
ఈ వార్తాకథనం ఏంటి
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలక సూచన జారీ చేసింది. పాలనాపరమైన కారణాల దృష్ట్యా జులై 19 వరకు సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో అత్యవసర అవసరాలు ఉన్నవారికి మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అత్యవసర సేవల కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంబసీ కాన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని సూచించింది. ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తాత్కాలిక పరిమితుల సమయంలో తత్కాల్ పాస్‌పోర్ట్‌ల జారీ, ఎన్‌ఆర్‌ఐ సర్టిఫికెట్లు, ఈ-వీసాలకు సంబంధించిన సేవలు, అలాగే సివిల్ ఐడీ గడువు ముగియనున్న వారికి స్వల్పకాలిక పాస్‌పోర్ట్‌ల దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు.
వివరాలు
యూఏఈలో కొద్దిరోజులపాటు నిలిచిపోయిన పాస్‌పోర్ట్, వీసా సహా పలు కాన్సులర్ సేవలు
అయితే సాధారణ పాస్‌పోర్ట్, వీసా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన ప్రక్రియ జులై 19 వరకు నిలిపివేస్తున్నట్లు ఎంబసీ స్పష్టం చేసింది. అదే సమయంలో తదుపరి అధికారిక ప్రకటన వెలువడే వరకు కువైట్‌లో పనిచేస్తున్న అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు (ICAC)కూడా మూసివేయబడతాయని తెలిపింది. దీంతో సాధారణ కాన్సులర్ సేవలు పొందాలనుకునే భారతీయులు తదుపరి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కూడా కొద్ది రోజుల పాటు భారత పాస్‌పోర్ట్, వీసా సహా పలు కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు కాన్సులర్ సేవలను బదిలీ చేసే ప్రక్రియ కారణంగానే ఆ అంతరాయం ఏర్పడినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.