India: జమ్ముకశ్మీర్‌పై అసత్య ఆరోపణలు వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఐరాస సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా, భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అసత్య ఆరోపణలు, విభజన అజెండాతో పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. ఆ ప్రాంత ప్రజలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు.
Details
ఐక్యరాజ్యసమితి చురుకైన పాత్ర పోషించాలి
జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్ అనవసరమైన సూచనలు చేయాల్సిన అవసరం లేదని ఎల్డోస్ మాథ్యూ తేల్చిచెప్పారు. నిరాధార ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలకు బదులు వాస్తవాలను గ్రహిస్తే మంచిదని పాక్‌కు హితవు పలికారు. స్వయం నిర్ణయాధికార హక్కు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరిచిన ప్రాథమిక సూత్రమేనని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రజాస్వామ్య దేశాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ఈ హక్కును దుర్వినియోగం చేయరాదన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, అవి ముగియాలంటే ఐక్యరాజ్యసమితి చురుకైన పాత్ర పోషించాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే కీలకమైన సందర్భాల్లో ఐరాస ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోకపోతే, సంస్థ సమర్థత, చట్టబద్ధత, విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.